రేపు ప్రారంభం
● జిల్లా కేంద్రానికి వెళ్లే బాధలు తప్పినట్టే.. ● హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు, వసతుల కల్పన ● దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ
నేలకొండపల్లి: ప్రజలు తమ సమస్యల పరిష్కారం, పథకాల కోసం వినతిపత్రాలు ఇచ్చేందుకు ఇన్నాళ్లు కలెక్టరేట్, సబ్ కలెక్టర్, ఆర్‌డీఓ కార్యాలయాల్లో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కారణంగా కొన్ని మండలాల వారికి దూరాభారం కావడం, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాదపడే వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల నుంచి మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి జరుగుతున్నా అన్ని శాఖల అధికారులు రాకపోవడం, ప్రజల సమస్యలపై స్పందన లేకపోవడంతో మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఇకపై ప్రతీ సోమవారం మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణకు నిర్ణయించింది. ప్రతీ సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు ప్రజావాణి జరగనుండగా, అందే ప్రతీ దరఖాస్తును పోర్టల్‌లో నమోదు చేసి పరిశీలన, పరిష్కారంపై జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమం గత వారమో మొదలుకావాల్సి ఉన్నా సెలవు రావడంతో రేపటి నుంచి ప్రారంభించనున్నారు.
నోడల్ అధికారులుగా ఎంపీడీఓలు
మండల స్థాయిలో జరిగే ప్రజావాణికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరిస్తారు. ఎంపీడీఓలే మండల స్థాయిలో అన్ని శాఖల శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ప్రజావాణి నిర్వహించాలి. తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, పశు సంవర్ధక శాఖ అధికారి, ఉద్యాన, విద్యా, మత్స్య, గృహ నిర్మాణ, అటవీ, భగీరథ, నీటిపారుదల, అర్‌అండ్‌బీ, విద్యుత్, వసతి గృహాల అధికారులతోపాటు ఐసీడీఎస్ ఉద్యోగులు, డిప్యూటీ తహసీల్దార్ కూడా పాల్గొనాల్సి ఉంటుంది.
ప్రతీ దరఖాస్తు పోర్టల్‌లో...
ప్రజావాణికి వచ్చే ప్రతీ దరఖాస్తును పోర్టల్ నమోదు చేయాలి. అంతేకాక ఫిర్యాదుదారులకు గుర్తింపు సంఖ్యలో రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మండల స్థాయి అధికారులు, శాఖల ఆపరేటర్లకు యూజర్ ఐడీ, పాస్‌వర్ట్‌లు కేటాయించారు. అలాగే, ఎంపీడీఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కూడా చివరి దశకు చేరింది.
ప్రజలకు కనీస సౌకర్యాలు
ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించడమే కాక వైద్య సేవల కోసం ఆరోగ్య సిబ్బందిని కేటాయించాలి. అలాగే, దివ్యాంగులకు వీల్‌చైర్లు, అవగాహన కల్పించేందుకు సిబ్బందిని నియమించాలి. వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లలతో వచ్చే బాలింతల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.
ఖమ్మం సహకారనగర్: మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 17న సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల ప్రజలు సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల కేంధ్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఇకపై జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని తెలిపారు.


