మధిర: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలతో పాటు సీపీఎస్‌ను రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో ఈనెల 17న(సోమవారం) కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు తెలిపారు. మధిరలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం కూడా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే ధర్నాకు మధిర ప్రాంత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్, నాయకులు డి.వెంకటేశ్వరరావు, సీహెచ్‌వీ.రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, పిల్లి నరసింహారావు, జమీర్, శాంతబాబు తదితరులు పాల్గొన్నారు.
12 ఎకరాల ఆయిల్‌పామ్ తోటకు నిప్పు
కొణిజర్ల: గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్‌పామ్ తోటకు నిప్పంటించడంతో 12 ఎకరాల్లో మొక్కలు కాలిపోయాయి. మండలంలోని గుబ్బగుర్తికి చెందిన రైతు మోత్కూరి వెంకటేశ్వరావు గ్రామ సమీపాన ఏన్కూరు – పల్లిపాడు ప్రధాన రహదారి వెంట 12 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నాడు. దాదాపు నాలుగేళ్లు పూర్తికావడంతో కాపుకు వచ్చే సమయాన శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో చెట్లన్నీ కాలిపోయాయి. అలాగే, డ్రిప్ పైపులు కూడా కాలిపోవడంతో భారీ నష్టం ఏర్పడడంతో కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
రాజ్‌భవన్ ‘ఎట్ హోం’లో జాతీయ ఉత్తమ
ఉపాధ్యాయులు
ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో జిల్లాకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. గవర్నర్ దంపతుల ఆహ్వానంతో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి అర్చన సంతోష్(2023), పెసర ప్రభాకర్‌రెడ్డి, సంపత్ కుమార్(2024), మారం పవిత్ర(2025) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని డీఈఓ సదానందం తదితరులు అభినందించారు.


