ఖమ్మంమయూరిసెంటర్/బోనకల్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9–30 గంటలకు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1–30 గంటలకు కలెక్టరేట్‌లో పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను భట్టి పంపిణీ చేస్తారు. ఆర్వాత 3–30 గంటలకు బోనకల్ మండలం చొప్పకట్లపాలెం, రామాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా, లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.
నాణ్యమైన వైద్యసేవలు, నిరంతర చికిత్స
ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి నాణ్యమైన వైద్యం, నిరంతర చికిత్స అందించటమే తమ లక్ష్యమని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) క్లినిక్, యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్సా విధానం, మందుల లభ్యత, రికార్డులను పరిశీలించారు. అనంతరం హెచ్‌ఐవీ బాధితులకు అందే వైద్యంపై ఉద్యోగులతో సమీక్షించారు. మందుల కొరత, చికిత్సలో అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైన మానసిక ధైర్యం కల్పించాలని, చికిత్స వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. నర్సింగ్ ఆఫీసర్లు రేవతి, రాణి, ఏఆర్‌టీ విభాగం అధిపతి డాక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ విద్యాశాఖ అధికారిగా చింతకాని ఎంఈఓ
చింతకాని: చింతకాని మండల విద్యాశాఖాధికారి సలాది రామారావుకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యా శాఖాధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో గురువారం డీఈఓలు, ఎంఓఈలకు శిక్షణ ఇవ్వగా, పాఠశాలల పర్యవేక్షణ ఇతర అంశాల్లో రామారావు ముందు నిలిచినట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయనకు డీఈఓ సదానందం సమక్షాన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.
కొత్తగా 39 సబ్‌స్టేషన్ల మంజూరు
నేలకొండపల్లి: అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేలా అన్నిచర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. మండలంలోని నాచేపల్లికి సబ్‌స్టేషన్ మంజూరు కాగా అవసరమైన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం జిల్లాకు కొత్తగా 39 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని.. అందులో మూడు పూర్తికాగా, ఇంకో తొమ్మిది నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే, ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం అందిన మూడు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ చింతమళ్ల నాగేశ్వరరావు, ఏడీఈలు నాగమల్లేశ్వరరావు, వెంకట్, ఏఈ జి.రవి తదితరులు పాల్గొన్నారు.


