ఖమ్మంలీగల్: గొలుసు చోరీ కేసులో ఖమ్మం పాండురంగాపురానికి చెందిన ఈదరబోయిన సుమన్‌కు చైన్ స్నాచింగ్ కేసులో మూడున్నరేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ అర్వ ప్రవీణ్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ఖానాపురానికి చెందిన వల్లభి లలిత ఈ ఏడాది జనవరి 8న రాత్రి ట్రంక్ రోడ్ సమీపాన రైల్వే ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. ఈమేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు నమో దు చేసి విచారణ చేపట్టగా ఈదరబోయిన సుమన్ ను నిందితుడిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం వరంగల్‌లోని లేబర్ కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిందితుడి అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి కె.సురేష్, ప్రభుత్వ న్యాయవాది గాయత్రి, ఉద్యోగులు వి.రామకృష్ణ, కె.శ్రీకాంత్, డి.నాగేశ్వరరావును సీపీ సునీల్‌దత్ అభినందించారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది..
ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీచేసిన ఖమ్మం మా మిళ్లగూడెంకు చెందిన బబ్బూరి వెంకటేశ్వర్లుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్డు న్యాయాధికారి కాకుమాను జ్యో తిర్మయి శుక్రవారం తీర్పుచెప్పారు. ఖమ్మం మామిళ్లగూడెంకు చెందిన జుజ్జూరి ఉపేందర్ వద్ద 2018 అక్టోబర్‌లో వెంకటేశ్వర్లు రూ.4లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 డిసెంబర్‌లో రూ.5లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడ నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో న్యాయవాది స్వామి రమేష్‌కుమార్ ద్వారా ఉపేందర్ లీగల్ నోటీస్ జారీచేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈమేరకు నేరం రుజువు కావడంతో వెంకటేశ్వర్లుకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5.90లక్షలు చెల్లించాలని, రూ.10వేలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని తీర్పు వెలువరించారు.
రూ. 3.12 లక్షల విలువైన
గంజాయి స్వాధీనం
సత్తుపల్లి టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.12 లక్షల విలువైన 6.360 కేజీల గంజాయితో పాటు కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబా ద్‌కు కారులో గంజాయి తరలి స్తున్నానే సమాచారంతో సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యాన ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు తాళ్లమడ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమాన కారులో పరిశీలించగా పది ప్యాకెట్లలో గంజాయి బయటపడింది. ఈమేరకు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగికి చెందిన కామేష్ మారి, కారా రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, రవాణాతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.తనిఖీల్లో ఎస్‌ఐ ప్రదీప్, ఈగల్ టీమ్, సత్తుపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హారన్ కొట్టినందుకు ఘర్షణ
నేలకొండపల్లి: సిగ్నల్ పనిచేయకపోవడంతో వాహనం వెళ్లడంలో జాప్యం జరగగా, వెనకాల కారు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఘర్షణ చోటుచేసుకుంది. మండలంలోని పైనంపల్లి వద్ద టోల్‌గేట్ మీదుగా ఖమ్మం నుంచి కోదాడ మార్గంలో శుక్రవారం సిగ్నల్ పనిచేయలేదు. దీంతో ఓ కారులోని వ్యక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయాన వెనక నుంచి వచ్చిన మరో కారు డ్రైవర్ పదేపదే హారన్ కొట్టడంతో ముందుగా కారులోని వ్యక్తులు నిలదీయడంతో వాదన మొదలై ఘర్షణకు దారి తీసింది. చివరకు టోల్‌గేట్ సిబ్బంది ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


