విజిలెన్స్ దాడులతో..
పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షణ లేమితో ధాన్యం పక్కదారి వేల క్వింటాళ్ల బియ్యం ఇవ్వకున్నా ఉదాసీనత మిల్లర్ల దోపీడీపై ప్రభుత్వం కన్నెర్రతో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు.. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కీలకంగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారుల పర్యవేక్షణ లేమితో కొన్ని మిల్లుల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం పక్కదారి పట్టించడమే కాక వేల క్వింటాళ్ల సీఎంఆర్ ఏళ్లుగా ఇవ్వకున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు మిల్లుల్లో ఇదే పరిస్థితితో ప్రభుత్వం కన్నెర్రజేసి విజిలెన్స్ బృందాలను తనిఖీలకు దింపడంతో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.
మర ఆడించి ఇవ్వమంటే..
రేషన్‌షాపుల ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోంది. ఇందుకు కావాల్సిన బియ్యం కోసం ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయిస్తోంది. ఇందులో వంద కేజీల ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. మిల్లులకు ధాన్యం కేటాయింపు, మర ఆడించాక సేకరణ, గోదాములకు తరలింపు, ఆపై పంపిణీని పౌర సరఫరాల సంస్థ పర్యవేక్షిస్తుంది. కానీ ధాన్యం మర ఆడించి ఇవ్వాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకపోగా, కొందరు పక్కదారి పట్టిస్తున్నా సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆట అయింది.
భారీగా పెండింగ్
జిల్లాలో 2021లో 55 రైస్ మిల్లులు ఉండగా, ప్రసుత్తం ఆ సంఖ్య 72కు చేరింది. 2020 –21 వానా కాలం, యాసంగి నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఐదేళ్లలో మిల్లుల నుంచి 22,35,522.79 క్వింటాళ్ల బియ్యం పెండింగ్ ఉన్నాయి. ఇందులో గత వానా కాలం, యాసంగి సీజన్లలో 19,65,405 క్వింటాళ్లు పెండింగ్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోకొన్ని మిల్లులు సీఎంఆర్ పెండింగ్ పెట్టడడంతో ప్రభుత్వం పలుమార్లు గడువు పెంచినా యంత్రాంగం పర్యవేక్షించక ఫలితం దక్కడం లేదు.
డీ ఫాల్ట్‌గా ప్రకటన
సీఎంఆర్ సరైన సమయానికి తిరిగి ఇవ్వకపోవడంతో జిల్లాలోని మూడు మిల్లులను పౌరసరఫరాల సంస్థ డీ ఫాల్ట్‌గా ప్రకటించింది. 2021 – 2024 మధ్య కాలంలో వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఈ మూడు మిల్లులే రూ.79.09 కోట్ల విలువైన 2,18,026.89 క్వింటాళ్ల సీఎంఆర్ బకాయి పడ్డాయి. ఈమేరకు ప్రభుత్వం సీఎంఆర్ కింద ధాన్యం ఇవ్వడాన్ని నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయినా ఇప్పటి వరకు సీఎంఆర్ మాత్రం తిరిగి ఇవ్వకపోగా, ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలడంతో చివరకు డీ ఫాల్ట్ జాబితాలో చేర్చారు.
రైతుల నుంచి కొనుగోలు ధాన్యం సేకరణలో తరుగు, తేమ పేరిట ప్రతీ సీజన్‌లో మిల్లర్లు నానా కొర్రీలు పెడుతున్నారు. ఇవన్నీ చూసి మిల్లర్ల తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈనేపథ్యాన సీఎంఆర్ బకాయి ఉన్న, ధాన్యం, బియ్యం పక్కదారి పట్టిస్తున్న మిల్లులపై దాడులు చేయాలని విజిలెన్స్‌ను పురమాయించింది. దీంతో జిల్లాలో పది రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు మిల్లుల్లో సీఎంఆర్ తేడాను గుర్తించి, మూడు మిల్లులపై కేసులు నమోదు చేశారు. ఇంకొన్ని రోజులు కూడా మిల్లుల్లో తనిఖీలు కొనసాగనున్న తెలిసింది.


