పూర్తిగా నష్టపోతాం...
● వైరా రిజర్వాయర్ కింద సాగుపై సందిగ్ధత ● 10 వేల ఎకరాల్లో వరి నారుమళ్లు ● ప్రస్తుతం నీటి విడుదలకు బ్రేక్
వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నారు మళ్లు పోసుకునేందుకు అధికారులు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేశారు. మొదటి నుంచి వరి సాగు వద్దని చెబుతూనే నీరు విడుదల చేయడంతో రైతులు ధైర్యంగా వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. రోజుకు 40 – 50 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేయగా.. చివరి వరకు విడుదల కొనసాగుతుందా, లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్టుగానే ప్రస్తుతం నీటి విడుదల నిలిపివేయడంతో నాట్లు వేయడంతో పాటు పంట చేతికి వచ్చేవరకు పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
16.10 అడుగుల మేర నీరు
రిజర్వాయర్ ఆయకట్టులో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 10 వేల ఎకరాల్లో నారు పోశారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 16.09 అడుగుల మేర నీరు ఉండగా.. రోజుకు 37 క్యూసెక్కుల మేర మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 11 మండలాలకు 467 గ్రామాలకు విడుదల చేస్తున్నారు. మరోవైపు వానలు ముఖం చాటేశాయి. దీంతో రిజర్వాయర్‌లోకి వరద చేరడం లేదు. ఇటీవల 15 రోజుల పాటు గోదావరి జలాలను విడుదల చేయడంతో అప్పుడు 13.3 అడుగులు ఉన్న రిజర్వాయర్ నీటిమట్టం 17.3 అడుగులకు చేరింది. గత నెల 13న ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ జిల్లా అధికారులతో మాట్లాడి నారుమళ్లకు నీరు విడుదల చేయించారు. అప్పటివరకు వరి వద్దని అధికారులు అవగాహన కల్పించినా... నారుమళ్లకు నీరు రావడంతో పంట చివరి వరకు నీరు విడుదల చేస్తారో ధీమాతో రైతులు కొందరు నాట్లు వేయడం కూడా మొదలుపెట్టారు.
అనుమానించినట్లుగానే...
గోదావరి జలాల రాక నిలిచిపోవడం, వరి సాగు వద్దని అధికారులు సూచిస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే వైరా మండలం స్టేజీపినపాక నుండి దాచాపురం వరకు నారుమళ్లు పోసుకున్న రైతులు కొందరు నాట్లు వేయడం కూడా పూర్తిచేశారు. అయితే, డిసెంబర్ వరకు కూడా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తేనే వరి సాగు సాఫీగా సాగనుంది. ఇప్పటికే ఎకరాకు రూ.5వేల నుంచి రూ. 10 వేల మేర ఖర్చు చేసిన రైతులు ఇంకా పెట్టుబడి పెట్టక తప్పదు. మరోవైపు దాచాపురం, గరికపాడు, గన్నవరం, ఖానాపురం వైరా నది పరివాహక ప్రాంతాల పరిధిలో రైతులు బోర్ల కింద వరి సాగు చేస్తున్నారు. రిజర్వాయర్ కాల్వపైనే ఆధారపడిన వారు మాత్రం నాట్లు వేయాలా, వద్ద అన్న మీమాంసలో ఉండిపోయారు. ఇంతలోనే వారు అనమానించినట్లుగా వైరా రిజర్వాయర్ నుంచి ఎట్టి పరిస్థితులలో సాగు అవసరాలకు నీరు విడుదల చేయొద్దని ఉన్నతాధికారుల సూచనలతో గురువారం రాత్రి కుడి, ఎడమ కాల్వకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయకట్టు పరిధి 10 వేల ఎకరాల్లో సాగుకు సిద్ధమైన రైతులు అయోమయంలో పడ్డారు.
అనధికారికమే...
ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ సూచనలతో జలవనరులు శాఖ అధికారులు ఇన్నాళ్లుఅనధికారికంగా రోజూ నీరుని విడుదల చేస్తున్నారని తెలిసింది. సుమారు 15 క్యూసెక్కులు విడుదల చేస్తుండడంతో విషయం తెలిసిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయకట్టు రైతులు ఎమ్మెల్యేను కలిసి సాగునీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని చెప్పగా ఆయన ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పినట్లు తెలిసింది.
సొంతంగా ఉన్న ఐదెకరాలకు తోడు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాట్లు వేయిస్తున్నా. అధికారులు మధ్యలో నీరు విడుదల నిలిపివేయాలని నిర్ణయించడం సబబు కాదు. పంట చేతికి వచ్చేవరకు నీటి విడుదల కొనసాగించకపోతే పూర్తిగా నష్టపోతాం.
– అయిలూరి పూర్ణచందర్‌రెడ్డి, రైతు, నారపునేనిపల్లి


