● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ● మధిరలో అభివృద్ధి పనుల పరిశీలన
మధిర: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తిచేయడం ఎంత ముఖ్యమో నాణ్యత పాటించడం కూడా అంతే ప్రధానమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. పేర్కొన్నారు. మధిరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), వైరా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, పురోగతి, నిర్మాణ సామగ్రి నాణ్యతపై ఆరా తీశాక ఆయన మాట్లాడారు. మధిరలో యూజీడీ పనులు పూర్తయితే పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడడమే కాక మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పనుల సందర్భంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పనులు పూర్తవగానే రోడ్లు పునరుద్ధరించాలని ఆదేశించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఆతర్వాత మధిర వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ అధిక దిగుబడులే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి చేపట్టాలని సూచించారు. పెసర, మినుములో అధిక దిగుబడులు, తెగుళ్లు, పురుగులను తట్టుకునే రకాల అభివృద్ధి, పప్పుధాన్యాల సాగుపై పరిశోధనలు చేయాలని తెలిపారు. అలాగే, మధిర వ్యవసాయ పాలిటెక్నిక్‌ను కూడా కలెక్టర్ సందర్శించి అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థుల బోధనపై ఆరాతీశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె.రుక్మినీదేవి, తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్ పరిశీలన
బోనకల్: బోనకల్ మండలం కలకోటలోని చెరువు ట్యాంక్‌బండ్ పనులను కలెక్టర్ దివాకర శుక్రవారం పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ట్యాంక్‌బండ్ నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరైన నేపథ్యాన పనుల వివరాలను జిల్లా టూరిజం అధికారి సుమన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీరు అవసరమయ్యే పంటలే సాగు చేయాలని సూచించారు. కాగా, కలకోట ఎస్సీ కాలనీ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. తహసీల్దార్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


