అక్టోబర్ 19న తుది జాబితా
ఇందులో మృతులు,
వలస వెళ్లిన వారే ఎక్కువ
ఖమ్మంలో అత్యధికంగా
80,663 ఓట్ల తొలగింపు
జిల్లాలో 87.31శాతం
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
నియోజకవర్గాల వారీగా వివరాలు
అనర్హుల తొలగింపునకు...
అర్హులైన ఓటర్లను గుర్తించడమే కాక మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని తొలగించడంతో పాటు ఓటర్ల వివరాల్లో అవసరమైన మార్పుల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను చేపట్టారు. ఈ సందర్భంగా 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత జాబితాతో రివిజన్ చేపట్టారు.
87.31 శాతం డిజిటలైజేషన్
జిల్లాలో 10,85,927 మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు అందజేయగా సోమవారం అర్ధరాత్రి వరకు డిజిటలైజేషన్ 87.31 శాతంగా నమోదైంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా పాలేరులో 92.21 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక్కడ 291 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,45,885 మంది ఓటర్లకు 2,26,729 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. అతితక్కువగా ఖమ్మం నియోజకవర్గంలోని 355 పోలింగ్ కేంద్రాల్లో 3,28,203 మంది ఓటర్లు ఉండగా.. 2,47,540 మందే ఫారాలు అందజేశారు. దీంతో ఇక్కడ 75.42 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. అలాగే, డిజిటలైజేషన్ చేసిన వాటిలో 43,131 దరఖాస్తుల మ్యాపింగ్ కాకపోవడంతో వీరికి ఈనెల 17 నుంచి నోటీసులు జారీ చేస్తారు. పుట్టిన తేదీని అనుసరించి కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, తల్లిదండ్రుల సర్టిఫికెట్లతో సమర్పిస్తే అర్హతల ఆధారంగా ముసాయిదా జాబితాలో చోటు కల్పిస్తారు.
తొలగింపులో ఖమ్మం టాప్
జిల్లాలో ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 12,43,781 మంది ఓటర్లకు గాను సర్ అనంతరం 1,57,854 మంది ఓట్లు తొలగించనున్నారు. ఇందులో 33,380 మంది మరణించగా.. 1,01,549 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు 11,004 మంది, చిరునామా లభించని వారు 11,371 మంది ఉండగా.. ఇతర కారణాలతో ఫారాలు అందజేయని వారు 550 మంది ఉన్నారని తేలింది. వీరందరి పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. కాగా, ఇతర కారణాల జాబితాలో ఉన్న వారెవనైనా అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆధారాలు సమర్పిస్తే పేర్లు కొనసాగుతాయి. మొత్తంగా 1,57,854 మంది ఓట్లు తొలగించనుండగా.. అందులో అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 80,663 మంది ఉన్నారు. తొలగించే మొత్తం ఓట్లలో 51 శాతానికి పైగా ఇక్కడే ఉండడం గమనార్హం. ఆ తర్వాత మధిరలో 20,638 మంది, వైరాలో 17,153 మంది, పాలేరులో 19,156 మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 20,244 మంది ఓట్లు తొలగించనున్నారు.
అగ్రస్థానాన వేంసూరు
‘సర్’ డిజిటలైజేషన్‌ను మండలాల వారీగా పరిశీలిస్తే జిల్లాలోని వేంసూరు అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ 46 పోలింగ్‌కేంద్రాల పరిధిలో 36,625 మంది ఓటర్లు ఉండగా.. 35,159 ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అంటే 95 శాతానికి పైగా నమోదైంది. అలాగే నేలకొండపల్లి మండలంలో 95 శాతం పూర్తవగా.. 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ అయిన మండలాల్లో తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, కూసుమంచి, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్, చింతకాని, జూలూరుపాడు, సింగరేణి, ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలు ఉన్నాయి. 80 – 90 శాతం లోపు సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మంరూరల్ మండలాలు, 70 – 80 శాతం లోపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిజిటలైజేషన్ పూర్తయింది.
‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదేరోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాక అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీంతో ‘సర్’ ప్రక్రియ పూర్తవుతుంది.
జిల్లాలో 1,57,854 ఓట్లు ఫట్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బీఎల్‌ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చే గడువు సోమవారంతో ముగియగా డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,43,781 మందికి గాను అందిన 10,85,927 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా జిల్లాలో 87.31 శాతంగా నమోదైంది. దీంతో మిగిలిన 1,57,854 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇందులో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారే అత్యధికంగా ఉన్నారు.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
వివరాలు ఖమ్మం పాలేరు మధిర వైరా సత్తుపల్లి మొత్తం ఓటర్లు 3,28,203 2,45,885 2,26,126 1,96,475 2,47,092
డిజిటలైజ్ చేసినవి 2,47, 540 2,26,729 2,05,488 1,79,322 2,26,848
వారసులుగా మ్యాపింగ్ 1,29,583 1,25,415 1,06,733 98,353 1,27,440
స్వయంగా మ్యాపింగ్ 95,151 90,951 95,127 77,604 96,432
మ్యాపింగ్ కానివి 22,799 10,363 3,628 3,365 2,976
మరణించిన వారు 9,155 5,540 6,888 5,604 6,193
శాశ్వతంగా వలస 58,952 11,345 10,889 9,659 10,704
ఆల్రెడీ ఎన్‌రోల్డ్ 3,865 1,577 1,871 1,376 2,315
అందుబాటులో లేనివారు 8,222 644 989 497 1,019
ఇతర కారణాలు 469 50 01 17 13
తొలగించే ఓట్లు 80,663 19,156 20,638 17,153 20,244


