గాలి, సముద్రం నుంచే
తాగునీరు..
లీకేజీలు, నీటి చౌర్యానికి అడ్డుకట్టే ప్రధాన లక్ష్యం
ఇజ్రాయిల్ పర్యటన నుంచి తిరిగొచ్చిన కేఎంసీ కమిషనర్ అభిషేక్
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. రూ.160 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వృథా కాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్‌ల నుంచి వినియోగదారుడి ఇంటికి నీరు చేరుతుంది. దేశం నుంచి తొమ్మిది మంది ఐఏఎస్‌లు, తొమ్మిది మంది చీఫ్ ఇంజనీర్లతో కూడిన బృందం ఇజ్రాయిల్‌లో పర్యటించగా, ఇందులో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉన్నారు. ఎనిమిది రోజుల పాటు అక్కడ జరిగిన అంతర్జాతీయ స్థాయి అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంశాలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయనాల్లో పాల్గొని ఖమ్మం వచ్చిన కమిషనర్ అక్కడి ప్రత్యేకతలు, వాటి ఆధారంగా ఖమ్మంలో చేపట్టే పనులను మంగళవారం వివరించారు. ఆ వివరాలు కమిషనర్ మాటల్లోనే...
మన దగ్గర లీకేజీలే సమస్య
ఇక్కడ ఇజ్రాయిల్ తరహా నీటి కొరత లేదు. ఖమ్మంలో లకారం, మున్నేరు, పాలేరు, సాగర్ కెనాల్ ద్వారా పుష్కలంగా నీరు లభిస్తోంది. నగరానికి రోజుకు 70 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, ప్రతిరోజూ అంతే పరిమాణంలో సరఫరా చేస్తున్నాం. అయినా ప్రజలకు రోజు విడిచి రోజు అది కూడా గంట లేదా గంటన్నర మాత్రమే నీళ్లు వస్తున్నాయి. నీటి లీకేజీలు, అనధికారిక కనెక్షన్లు, పాతకాలం నాటి మౌలిక సదుపాయాలే ఇందుకు కారణం. ప్రజలు నేరుగా లైన్‌మెన్లతో మాట్లాడి, పైపులకు జాయింట్లు వేసి అనధికారికంగా నీటిని తోడేస్తున్నారు. తద్వారా నీరు వృథా అవడమే కాక కేఎంసీకి ఆదాయం రావడం లేదు. అందుకే లీకేజీలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం.
రూ.160 కోట్లతో నగరమంతా..
ఖమ్మం నగరం మొత్తంలో 150 డీఎంఏలు ఉన్నాయి. డీఎంఏ అంటే నీటి సరఫరా వ్యవస్థలో నీటి ప్రవాహం, పీడనాన్ని మీటర్ల ద్వారా పర్యవేక్షించి నియంత్రించే ఒక నిర్దిష్ట ప్రాంతం. పైలట్ ప్రాజెక్ట్ విజయంతో కార్పొరేషన్ తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్ల గ్రాంట్ మంజూరు చేయడంతో టెండర్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఈ నిధులతో నగరంలోని అన్ని డీఎంఏలలో ఆధునిక పైప్‌లైన్లు, సెన్సార్లు ఏర్పాటు చేసి 24 గంటల నిరంతర తాగునీటి సరఫరాను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.
ఇజ్రాయిల్‌లో నీటి లభ్యత చాలా తక్కువ. అందుకే వాళ్లు గాలి నుంచి నీటిని తయారు చేయడం, సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చడం లాంటి వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అక్కడ నీటిని అమూల్యమైన సహజ వనరుగా పరిగణిస్తారు. సొంతంగా బోర్ వేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రతీ బోర్‌కు మీటర్ బిగించి నీటి వినియోగానికి తగినట్లుగా బిల్లు చెల్లించాల్సిందే. పైగా లీకేజీలను గుర్తించడానికి భూగర్భ పైప్‌లైన్లలో ప్రతీ 200 మీటర్లకు ఒక సెన్సార్లు, స్కాడా సిస్టమ్ అమర్చారు. లీకేజీ ఏర్పడగానే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి.
రూ.160 కోట్లతో నిరంతరం తాగునీటి సరఫరా


