రూ. 17.74 కోట్లతో ఫ్రూట్‌ మార్కెట్‌ | - | Sakshi
Sakshi News home page

రూ. 17.74 కోట్లతో ఫ్రూట్‌ మార్కెట్‌

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్‌కు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. వీధి వ్యాపారుల ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో 2.30 ఎకరాల్లో మార్కెట్‌ ఏర్పాటుచేస్తారు.

వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో..

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మార్కెటింగ్‌ శాఖ అధికారులు అవసరమైన నిర్మాణాలు, నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. పండ్ల మార్కెట్‌లో యార్డు, వే బ్రిడ్జి, అంతర్గత రహదారులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, ప్రహరీ, ఆర్చ్‌ వంటి నిర్మాణాలకు రూ.17.74 కోట్లు అవసరమని అందులో పొందుపరిచారు.

రైతులు, వ్యాపారులకు ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. మామిడి, జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, జీడి మామిడి వంటి పండ్ల తోటలు ఉండగా.. వీటి విక్రయానికి రైతులు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారులకు కూడా సరైన హోల్‌సేల్‌ మార్కెట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే దాదాపు 44మంది హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారులు ఉన్నారు. ఈమేరకు ఖమ్మంలో ఫ్రూట్‌ మార్కెట్‌ ఏర్పాటైతే రైతులకే కాక వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడనుంది.

ఖానాపురంలో ఏర్పాటుకు కసరత్తు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా పండ్ల మార్కెట్‌ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఖానాపురంలోని 2.30 ఎకరాల్లో పండ్ల మార్కెట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ఇందుకు కావాల్సిన రూ.17.74 కోట్ల మంజూరుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.

– యరగర్ల హన్మంతరావు, ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement