రెవెన్యూ.. అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ.. అక్రమాలు

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

రిజిస్ట్రేషన్ల మాయాజాలం తెలియగానే హోల్డ్‌లో పెట్టాం..

తీరు మారని అధికారులు

సర్టిఫికెట్లు లేకున్నా, కోర్టు కేసులున్నా పట్టని అధికారులు

వారసుల అంగీకారం లేకుండానే భూమి రిజిస్ట్రేషన్‌?

భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించగా కొందరు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరమైన పత్రాలను పరిశీలించకుండానే ఇటీవల ఓ తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేయగా, ఇదేమిటని అడిగితే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని సర్దిచెప్పారని సమాచారం. చాలాచోట్ల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వివాదంలో ఉన్నా..

జిల్లాలో సమగ్ర భూ సర్వే కింద కాకరవాయి గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. గ్రామంలోని మొత్తం భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయగా.. భూమి వివరాలు పరిశీలంచుకోవాలని రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇదేగ్రామంలో ఓ భూమిపై వివాదంలో ఉండడం, కోర్టు పరిధిలో కేసు కొనసాగుతుండగా అది తేలేవరకు ఎలాంటి లావాదేవీలు జరపొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వివాదంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఇదేమిటని వారసులు అడిగితే కోర్టులో ఉందనే విషయం తమకు తెలియదంటూ దాటవేసినట్లు సమాచారం.

నిబంధనలన్నీ బేఖాతర్‌

కాకరవాయికి చెందిన ఓ వ్యక్తి భార్యకు పసువు కుంకుమ కింద ఆమె తల్లిదండ్రుల నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ దంపతులకు ఉన్న ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. మిగిలిన ఇద్దరిని వివాహాలు జరిగాయి. సదరు వ్యక్తి భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఆమె పేరిట ఉన్న భూమిని తన పేరుపైకి మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, భూమి పంపకాలపై అప్పటికే కోర్టులో కేసు ఉండగా, విషయాన్ని వారసుల్లో ఒకరు తిరుమలాయపాలెం తహసీల్దార్‌, కూసుమంచి రిజిస్ట్రార్‌, ఖమ్మం రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక భార్య పేరిట ఉన్న భూమిని మార్చాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ లేదా లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ లేదా కోర్టు ఉత్తర్వులు ఉండాలి. అంతేకాక కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డులు ఉండాలి. కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో కూతుర్ల పేరు లేకుండా.. కేవలం సదరు వ్యక్తి పేరు మాత్రమే ఉంది. ఇక భూబదలాయింపు సమయాన ఇద్దరు కూతుర్లకు సమాచారం ఇవ్వకపోగా అభ్యంతరాలను స్వీకరించలేదు. ఆయన అన్‌ రిజిస్టర్డ్‌ వీలునామా సమర్పించినా అధికారులు చట్టబద్ధతపై విచారణ చేయలేదు. ఆపై రెండు నెలల క్రితం ఆయన పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. ఆ తర్వాత అదే నెలలో ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరిట కొంత, ఇతర వ్యక్తుల పేరుపై కొంత రిజిస్ట్రేషన్‌, జీపీఏ చేపించాడు. ఇవన్నీ ఒకే రోజు చేయడం విశేషం.

కాకరవాయికి చెందని ఓ వ్యక్తి తన భార్య చనిపోయిందని, ఆమె రాసిన వీలునామా ప్రకారం భూమిని తన పేరిట మార్చాలని కోరాడు. కుటుంబంలో ఓ కూతురితో వివాదం ఉందని మొదట నా దృష్టికి రాలేదు. ఈ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ప్రస్తుతం అవి అమల్లో(ఫోర్స్‌) లేవు. వివాదం తెలియగానే లావాదేవీలు, బదిలీలను పూర్తిగా హోల్డ్‌లో పెట్టాం. కాకరవాయి పరిధిలో రీ–సర్వే పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు, బదిలీలు జరగవు.

– లూథర్‌ విల్సన్‌, తహసీల్దార్‌, తిరుమలాయపాలెం

రైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం భూసమస్యలకు పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చారు. గతంలో ఉన్న ధరణిలో చాలా భూములు నిషేధిత జాబితాలో పడడంతో రైతులు క్రయవిక్రయాలకే కాక రిజిస్ట్రేషన్ల సమయంలోనూ అవస్థ పడ్డారు. అయితే, ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొచ్చినా రైతుల ఇక్కట్లు తీరడం లేదు. పీఓబీ, ఇతర సమస్యలతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా, ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ డేకు చాలావరకు ఇటువంటి సమస్యలే వస్తున్నాయి.

భూ భారతి చట్టం, నిబంధనలు తూచ్‌

గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొత్త చట్టంలోని నిబంధనలను

విస్మరిస్తున్న కొందరు రెవెన్యూ అధికారులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇటీవల మృతి చెందిన మహిళ పేరిట ఉన్న భూమిని వారసుల అంగీకారం లేకుండానే ఆమె భర్త పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన ఘటన వెలుగు చూసింది. అంతకుముందే వారసులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చినా పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. భూముల రీసర్వేకు పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఈ ఘటన

చోటుచేసుకోగా వారసుల్లో ఒకరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement