రోడ్డెక్కిన కార్మిక, రైతు లోకం | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన కార్మిక, రైతు లోకం

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

లేబర్‌ కోడ్లు, వ్యవసాయ బిల్లుల రద్దుకు డిమాండ్‌

జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, రాస్తారోకో

ఖమ్మం మయూరిసెంటర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ విధానాలు అనుసరిస్తోందని ఆరోపిస్తూ అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు, సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుతో సోమవారం జిల్లా కేంద్రంలో ‘జైల్‌ భరో’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జిల్లా పరిషత్‌ సెంటర్‌ నుంచి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని క్రమాన నాయకులు, కార్మికులు స్వచ్ఛందంగా పోలీసు వాహనాలు ఎక్కి అరెస్టు అయ్యారు.

హక్కులను కాలరాస్తున్నారు..

రాస్తారోకో సందర్భంగా సీపీఎం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య, బీఆర్‌ఎస్‌ నాయకుడు పగడాల నాగరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ, పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. అంతేకాక అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుని, జీరో సుంకంతో దిగుమతులను ప్రోత్సహించడం వల్ల దేశ రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పేదలకు ఇచ్చే బియ్యంలో కోత తదితర సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు జి.రామయ్య, తుమ్మ విష్ణువర్ధన్‌, సింగు నరసింహారావు, తోట రామాంజనేయులు, యర్రా శ్రీనివాస్‌, వై.విక్రమ్‌, ఎస్‌.నవీన్‌రెడ్డి, గోవిందరావు, వెంకన్న, నరాల నరేష్‌, ఆవుల అశోక్‌, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాషా, దండ జ్యోతిరెడ్డి, తొట్టి కొమరయ్య, రాంబాబు, కేలోత్‌ లక్ష్మణ్‌, శిరోమణి, బండి పద్మ, పి.రమ్య, షకీనా, ఝాన్సీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement