అలా.. ముగిసింది! | - | Sakshi
Sakshi News home page

అలా.. ముగిసింది!

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

● 45 రోజులపాటు సాగిన ‘సర్‌’ ప్రక్రియ ● చివరి రోజున హడావుడి ● అర్ధరాత్రి వరకు సాగిన డిజిటలైజేషన్‌

ఇళ్లకు వెళ్తూ ఆరా

● 45 రోజులపాటు సాగిన ‘సర్‌’ ప్రక్రియ ● చివరి రోజున హడావుడి ● అర్ధరాత్రి వరకు సాగిన డిజిటలైజేషన్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జిల్లాలో సోమవారం ముగిసింది. ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించడానికి, ఆ ఫారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు చివరి రోజు కావడంతో హడావుడి కనిపించింది. జిల్లాలో ఆదివారం నాటికి 87.25 శాతం ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తవగా, పాలేరులో అత్యధికంగా.. ఖమ్మం నియోజకవర్గంలో అతితక్కువగా నమోదైంది.

రెండు సార్లు గడువు పొడిగింపు

అర్హత ఉన్న వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతోపాటు చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండేసి చోట్ల ఓట్లు కలిగిన వారిని తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ ప్రక్రియ జూన్‌ 25న మొదలైంది. ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డిజిటలైజేషన్‌ కోసం జిల్లాలో 1,460 మంది బీఎల్‌ఓలను నియమించారు. ఈమేరకు 12,43,781 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. సేకరణ, డిజిటలైజేషన్‌ పూర్తికి తొలుత జూలై 24 వరకు గడువు విధించారు. ఆతర్వాత ఈనెల 3, మళ్లీ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు.

ఎట్టకేలకు పూర్తి

ఎన్యుమరేషన్‌ ఫారాలు ఓటర్ల చేతికి అందినా వివరాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు చూసుకోవడం, సీరియల్‌ ఇతర నంబర్లు తెలుసుకోవడం భారంగా మారింది. చదువుకున్న వారే ఈ విషయంలో తడబడగా.. నిరక్షరాస్యులకు తీరని సమస్యగా మారింది. దీంతో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామపంచాయతీల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో ఎన్యుమరేషన్‌ ఫారాల సేకరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాగే వివిధ పార్టీల ఆధ్వర్యాన బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించగా వారు కూడా ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరించారు.

9వ తేదీ నాటికి 87 శాతం

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ఆదివారం నాటికి 87.25 శాతం పూర్తయింది. పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 92.17 శాతం పూర్తయింది. అతి తక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 75.25 శాతమే చేయగలిగారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలోనే నమోదైంది. సోమవారంతో ‘సర్‌’ గడువు ముగియగా గత 45 రోజులుగా పనిచేస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌ఐఆర్‌కి సంబంధించి పూర్తి గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి.

రెండు సార్లు గడువు పెంచినా చాలామంది చివరి రోజైన సోమవారం వరకు కూడా ఎన్యుమరేషన్‌ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో బీఎల్‌ఓలు ఊర్లలో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మృతిచెందిన వారిని మినహాయించి ఫారాలు ఎవరెవరో ఇవ్వలేదో జాబితా పరిశీలిస్తూ ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. అంతేకాక పలువురి నుంచి ఫారాలు స్వీకరించి అక్కడికక్కడే డిజిటలైజేషన్‌ చేసే పనుల్లో రాత్రి పొద్దుపోయే వరకు నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement