వైరారూరల్: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగితో పాటు ఆయన కుటుంబీకులు గాయపడ్డారు. వైరా మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన ప్రశాంత్ మణుగూరు ఏరియా కొండాపురం భూగర్భ గనిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం భార్యాపిల్లలతో కలిసి స్వస్థలానికి వచ్చి తిరిగి కారులో వెళ్తూ ముందున్న లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమాన ఎదురుగా వచ్చిన మరో లారీని ఢీకొట్టగా ప్రశాంత్‌తో పాటు ఆయన భార్య ఆశఅంజని, కుమార్తెలు యవనశ్రీ, నేహాశ్రీ, ధ్వనికశ్రీకి గాయాలయ్యాయి. అయితే, ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ప్రశాంత్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, స్థానికులు గంట పాటు శ్రమించి బయటకు తీశారు. ఇదే సమయాన అటుగా వెళ్తున్న వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ అంబులెన్స్ రావడం ఆలస్యంం కావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. లారీడ్రైవర్ బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు.
లారీని ఓవర్‌టేక్ చేస్తూ
ఇంకో లారీని ఢీకొట్టిన కారు


