టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిపై పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిపై పోక్సో కేసు

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా చెలామణి అవుతున్న గౌరవరపు డేవిడ్‌రాజ్‌ శనివారం మద్యం మత్తులో వైరాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి గణితం చెబుతానంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం ఈ ఘటన జరగగా కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వారు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ పుష్పాల రామారావు చేరుకుని డేవిడ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. కాగా, డేవిడ్‌పై గతంలోనే రౌడీషీట్‌ నమోదైంది.

సాయం చేస్తానంటూ నగదు చోరీ

నేలకొండపల్లి: దివ్యాంగులకు సాయం చేస్తాను, కొంత డబ్బు చెల్లిస్తే అంతకు మించి ఇస్తానని నమ్మబలికిన వ్యక్తి రూ.15 వేలు చోరీ చేసిన ఘటన ఇది. నేలకొండపల్లికి చెందిన మండల కేంద్రంలో ఓ దివ్యాంగుడు శనివారం స్కూటీపై పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉండగా, పల్సర్‌ బైక్‌పై మాస్క్‌ పెట్టుకున్న గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. ఎంత డబ్బు ఉంటే అంతకు మించి సాయం చేస్తాననడంతో సదరు దివ్యాంగుడు జేబులో రూ.15 వేల నగదు తీస్తున్నాడు. ఆ నగదు తాను లెక్కిస్తానంటూ యువకుడు లాక్కుని పరారయ్యాడు. అదే సమయాన వచ్చిన చెన్నారానికి చెందిన దివ్యాంగుడు వీరయ్య తన వాహనంపై వెంబడించినా నిందితుడు వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనంపై మాస్క్‌ ధరించి తిరుగుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

స్కూటీ అపహరణ

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి తుమ్మూరి రామారావు వీధిలో స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ తన ఇంటిముందు శుక్రవారం రాత్రి స్కూటీ పార్క్‌ చేశాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని అపహరించగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

మృతుడు రేపల్లెవాడ వాసి..

చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్‌ సమీపాన గురువారం వందేభారత్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడి ఆచూకీ గుర్తించారు. మృతుడిని చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడగాని భిక్షం (75)గా గుర్తించగా, ఆర్థిక సమస్యలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా, ఛిద్రమైన మృతదేహానికి అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యాన శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement