మంత్రి పొంగులేటి హామీ మేరకు
అధికారుల సర్వే
కల్లూరురూరల్: కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి త్వరలోనే బస్సు సర్వీస్ ఏర్పాటు చేయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనుంది. ఇటీవల కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రెండో తరగతి విద్యార్థి నల్లగట్ల క్రిశాంక్ మంత్రిని కలిసి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్నందున బస్సు నడిపించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి పొంగులేటి ఆరాతీయగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వే చేస్తామని ఆర్టీసీ అధికారి చెప్పడంతో వారంలోగా సర్వీస్ నడపాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు శుక్రవారం కల్లూరు, లింగాల, కొత్త ఎర్రబోయినపల్లి, పాత ఎర్రబోయినపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి వినతిపత్రం ఇచ్చిన బాలుడు క్రిశాంత్‌ను అభినందించారు. కాగా, డీఎం నివేదికను ఖమ్మం ఆర్‌ఎంకు అందజేశాక ఎర్రబోయినపల్లికి బస్సు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం మధిర నుంచి కల్లూరుకు నడుస్తున్న సర్వీస్ ఎర్రబోయినపల్లి గ్రామానికి రావాలంటే మూడు కి.మీ. అదనంగా తిరిగి రావాల్సి ఉంటుంది.


