ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున నీరు అధికంగా అవసరమయ్యే వరికి బదులు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. సీజనల్‌ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్‌ కార్డుల పంపిణీ, చేయూత పెన్షన్లు, యూనిఫామ్‌ పురోగతిపై ఆరా తీస్తూ సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్‌ దివాకర టీఎస్‌.. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో పంట మార్పిడి చేసేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, భూగర్భ జలాలు పెరిగేలా పంట కుంటలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, స్మార్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, మహోత్సవంపై సూచనలు చేశారు. డీఆర్వో రామ్మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్‌, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మధుసూదన్‌ పాల్గొన్నారు.

మార్కెట్‌కు

రూ.60 లక్షల ఆదాయం

మక్కల అమ్మకంతో పన్ను రూపంలో లబ్ధి

ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల అమ్మకం పన్ను ద్వారా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రూ. 60 లక్షల ఆదాయం లభించింది. గడిచిన యాసంగి సీజన్‌లో ప్రైవేట్‌ మార్కెట్‌లో మక్కలకు సరైన ధర లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. ఈమేరకు క్వింటాకు రూ. 2,400తో కొనుగోలు చేసిన 28 వేల మెట్రిక్‌ టన్నుల మక్కలను ఖమ్మం మార్కెట్‌లో భద్రపరిచారు. ఈ పంటను ఇటీవల టెండర్ల ద్వారా విక్రయించగా.. కొనుగోలు చేసిన వ్యాపారులు, సంస్థల బాధ్యులు తరలిస్తున్నారు. ఈమేరకు పంటల క్రయవిక్రయాలపై మార్కెట్‌కు ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉండడంతో మార్కెట్‌కు రూ.60 లక్షల ఆదాయం లభించింది.

14లోగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు

తల్లాడ/ఏన్కూరు: గ్రామపంచాయతీల వారీగా అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ఈనెల 14లోగా రూపొందించాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత సూచించారు. తల్లాడ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రామ కార్యదర్శుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచాయతీల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి మండలాల వారీగా సమర్పించాలని తెలిపారు. అలాగే, ప్రతీ గ్రామపంచాయతీలో 20 పంట కుంటల ఏర్పాటుకు రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలన్నారు. అలాగే, ఏన్కూరు మండలం భగవాన్‌నాయక్‌ తండా, గార్లఒడ్డు, రేపల్లెవాడ గ్రామాల్లో పర్యటించిన ఆమె పంట కుంటలు, వననర్సరీలు, గ్రామాసమాఖ్య భవన నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల పొలాల్లో పంట కుంటలు తవ్వించడం ద్వారా సాగునీరు అందడమే కాక భూగర్భ జలాలు మెరుగవుతాయని, ఇందుకోసం జిల్లాలో 800 స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో అడిషనల్‌, అసిస్టెంట్‌ పీడీలు శిరీష, చలపతిరావు, డీఎల్‌పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓలు ఏ.శ్రీధర్‌రాజు, భాగ్యశ్రీ, సర్పంచ్‌లు భూక్యా నర్సి, సురేష్‌, ధరావత్‌ మణి, ఉద్యోగులు సూరయ్య, జీవీఎస్‌.నారాయణ, రేగళ్ల హరికృష్ణ, వాణిశ్రీ, కోటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement