● దశల వారీగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం: అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈనెల 15న కొత్త ఆసరా పింఛన్ల మంజూరు ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. తిరుమలాయపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తిప్పారెడ్డిగూడెం నుంచి రాకాసి తండా వరకు రూ.2.10 కోట్లు, రాజారం నుంచి తుమ్మగూడెం వరకు రూ.4.50 కోట్లతో నిర్మించే బీటీ రహదారులతో పాటు హైదర్‌సాయిపేట, పాతర్లపాడుల్లో గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలుచేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు.
ఎంపికలో పారదర్శకత
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇళ్ల కోసం ఎవరూ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, త్వరలోనే రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డీపీఓ వినోద్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ఆత్మ చైర్మన్ చావా శివరామకష్ణ నాయకులు, సర్పంచ్‌లు రామసాయం నరేష్‌రెడ్డి, కొప్పుల అశోక్ మంగీలాల్, బెల్లం శ్రీనివాస్, ఉపేందర్, సిమ్లానాయక్, జడల సుష్మ, మందుల అరుణ తదితరులు పాల్గొన్నారు.


