రేషన్ లబ్ధిదారులకు 15నుంచి పంపిణీ
ఖమ్మం సహకారనగర్: ఏళ్ల తర్వాత పేదలకు కొన్నాళ్ల క్రితం రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. అంతేకాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈక్రమాన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు అందించాలని నిర్ణయించింది.
2016 లో లాస్ట్...
2016వ సంవత్సరంలో జిల్లాల పునర్విభజనకు ముందు రేషన్‌కార్డులు ముద్రించి జిల్లాలకు పంపించారు. అయితే, జిల్లాల పునర్విభజన సమయాన వాటిని పంపిణీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఆతర్వాత అవసరమైన వారు ఈపీడీఎస్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఈనేపథ్యాన కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాకు కార్డులు ఇప్పటికే చేరగా ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా కొందరికి అందజేయనుండగా.. ఆ తర్వాత మిగతావారికి రేషన్‌షాపుల్లో పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748రేషన్ షాప్‌లు, 4,73,271 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 13,36,126మంది లబ్ధిదారులు ఉన్నారు. కుటుంబంలోని మహిళ ఫొటోతో ముద్రించిన కార్డులు జిల్లాకు చేరాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు.


