ప్రారంభంలోనే ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రారంభంలోనే ప్రమాదం

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

కొత్త హైవేపై కారును ఢీకొట్టిన వ్యాన్‌

తల్లీ కుమారుడి మృతి,

తండ్రికి తీవ్రగాయాలు

ఓ పక్క అప్రోచ్‌రోడ్డును మూసేయడంతో ఎదురుగా వెళ్తుండగా ఘటన

ఏం జరిగింది...

చింతకాని /ఖమ్మంరూరల్‌: అధికారుల అనాలోచిత ధోరణి.. వ్యక్తుల నిర్లక్ష్యం వెరసి ఇటీవలే ప్రారంభమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భవిష్యత్‌లో గొప్పగా ఎదగాలని కుమారుడిని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్పించేందుకు తల్లిదండ్రులు వెళ్తుండగా తల్లీకుమారుడు మృతి చెందారు. కారు నడుపుతున్న కుటుంబ పెద్ద తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదానికి ఇరువైపులా తప్పు కనిపిస్తున్నా... హైవేపై రాకపోకలకు అనుమతించిన రోజుల వ్యవధిలోనే ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబానికి విషాదం మిగిలింది.

గాంధీనగర్‌ నుంచి హైదరాబాద్‌కు

చింతకాని మండలం మండలం గాంధీనగర్‌ కాలనీకి చెందిన పాపబత్తిని నరసింహారావు దళితబంధు పథకంలో వచ్చిన కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత(40)తో పాటు కుమారులు ఉమేష్‌, పవన్‌కుమార్‌(19) ఉన్నారు. పెద్దకుమారుడు హైదరాబాద్‌లో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. ఇటీవల ఇంటర్‌ పాసైన పవన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. ఆయనను కాలేజీలో చేర్పించేందుకు భార్యతో కలిసి నరసింహారావు బయలుదేరాడు.

హడావుడిగా ప్రారంభించడంతో...

ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిపై వైరా మండలం సోమవారం వద్ద చాన్నాళ్లుగా అనుమతిస్తున్నారు. అయితే, ధంసలాపురం బ్రిడ్జి ఇటీవల పూర్తయినా, ఇంకా ఎగ్జిట్‌ వద్ద ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ హడావుడిగా మూడు రోజుల క్రితం రాకపోకలకు అనుమతించారు. ఈవిషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు హైవేను ఎంచుకుంటున్నారు. కాగా, హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు ఎక్కాల్సిన అప్రోచ్‌ రోడ్డును పనుల దృష్ట్యా అధికారులు మూసేశారు. ఇదే సమయాన దేవరపల్లి వెళ్లే మార్గంలో హైవే ఎక్కే రోడ్డును మూసివేయలేదు. అంతేకాక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో హైదరాబాద్‌ వైపు వెళ్లాల్సిన వారు కూడా దేవరపల్లి వైపు ఉన్న రోడ్డుపైకి ఎక్కి రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయకపోవడంతో గురువారం నాటి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే తేరుకున్న అధికారులు హైదరాబాద్‌ వైపు ఎంట్రీ పాయింట్‌ను మూసివేసి దేవరపల్లి వైపు ఎంట్రీ పాయింట్‌ను మాత్రం వదిలేయడం గమనార్హం. ఈ అంశంపై ఎన్‌హెచ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ దివ్యను వివరణ కోరగా.. అప్రోచ్‌ రోడ్డు పనుల సామగ్రి తీసుకొచ్చే వాహనాల కోసం ఓ పక్క తెరిచి ఉంచామే తప్ప ఇతర వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.

చదువులో టాప్‌..

మృతుడు పవన్‌ ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో పూర్తిచేయగా 932 మార్కులు వచ్చాయి. అనంతరం ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు వచ్చింది. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే పవన్‌తో పాటు ఆయన తల్లి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై నరసింహారావు తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో ఖమ్మంరూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

గాంధీనగర్‌ కాలనీ నుంచి ఉదయం 7–30 గంటలకు బయలుదేరిన వీరు ధంసలాపురం వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి ఎక్కేలా అవకాశం లేకపోవడంతో.. దేవరపల్లి వైపు వెళ్లే రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కారు. సమీపాన ఎక్కడా యూటర్న్‌ లేకపోవడంతో వీరు హైదరాబాద్‌ వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొద్దిదూరం తర్వాత మూలమలుపు వద్ద ఎదురుగా ద్రాక్ష పండ్ల లోడుతో హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టి కారును 30 అడుగుల దూరం లాక్కెళ్లడంతో తల్లి సుజాత, కొడుకు పవన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేకాక డ్రైవింగ్‌ చేస్తున్న నరసింహారావు కారులో ఇరుక్కుపోవడంతో క్రేన్‌ సాయంతో బయటకుతీశారు. ఆయన వైపు బెలూన్‌ ఓపెన్‌ కావడంతో గాయాలతో బయటపడ్డాడు. అయితే, పక్కనే ఉన్న పవన్‌కుమార్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో బెలూన్‌ తెరుచుకోకపోవడం వల్ల తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement