● రూ.30లక్షల మేర ఆస్తినష్టం ● ఆభరణాలు, నగదు నిల్వ చేసిన లాకర్లు సేఫ్
మధిర: మధిరలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)శాఖలో బుధవారం అగ్ని ప్రమా దం జరిగింది. ఉదయాన్నే బ్యాంకు నుంచి కాలిన వాసన వస్తుండడంతో సమీపంలోని దుకాణదారులు బ్యాంకు సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తాళాలు తెరిపించగా పొగలు కమ్మేసి మంటలు వస్తుండడంతో అదుపు చేశారు. అప్పటికే ఏసీలు, ఫర్నిచర్, సీలింగ్ దగ్ధమయ్యా యి. క్యాష్ కౌంటర్ పరిసరాల్లోని సీలింగ్, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అయితే, ఖాతాదారుల లాకర్లు, బ్యాంక్ నగదు నిల్వ చేసే లాకర్ భద్రంగా ఉండడంతో అధికారులు, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకులోని ఫైళ్లకు నష్టం జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూబీఐ శాఖ మేనేజర్ నవీన్ తెలిపారు. అయితే, ఘటనలో రూ.30లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు మధిర టౌన్ ఎస్‌ఐ కిషోర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రమాద సమాచారం తెలియని గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులు రోజు మాదిరిగా 10 గంటలకు బ్యాంకు వద్దకు చేరుకోగా, లావాదేవీలు నిలిచిపోవడంతో వెనుదిరిగారు.


