నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దు

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

వేణుకుమార్‌కు నామా ట్రస్ట్‌ ద్వారా రూ.50 వేల ఆర్థికసాయం

ముదిగొండ: కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ పేర్కొన్నారు. అయితే, నిరుద్యోగులు ధైర్యం కోల్పోకుండా ప్రభుత్వ తీరుపై పోరాడాలని సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి వేణుకుమార్‌ను ఖమ్మం ఆస్పత్రిలో సోమవారం ఆయన పరామర్శించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రకటించిన రూ.50 వేల ఆర్థిక సాయం చెక్కును అందజేసి మాట్లాడారు. నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌, నాయకులు గడ్డం వెంకట్‌, నానబాల కిరణ్‌, గడ్డం చిన్నచందర్‌రావు, కొమరం స్వామి, మేడ ఎల్లారావు పాల్గొన్నారు.

హీరో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనం విడుదల

ఖమ్మంగాంధీచౌక్‌: హీరో మోటో కార్ప్‌ రూపొందించిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనం హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ను సోమవారం ఖమ్మం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బైపాస్‌ రోడ్డులోని శ్రీశ్రీశ్రీ హీరో షోరూంలో వాహనాన్ని సంస్థ ఎండీ ఈశ్వరప్రగడ రంగనాథ్‌ విడుదల చేసి మాట్లాడారు. హీరో స్ప్లెండర్‌లో కూడా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ మోడల్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వాహనాలు ఈ20 నుంచి ఈ85 వరకు ఇంధనాలతో నడుస్తాయని వివరించారు.

చారిత్రక కట్టడాల

పరిరక్షణకు పెద్దపీట

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్‌ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్‌ సర్కిల్‌ ద్వారా గడిచిన ఐదేళ్లలో కేటాయింపులు పెరిగాయని తెలిపారు. ‘అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌ – 2.0’ కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఎంపిక చేసిన 41,762 పాఠశాలలకు గాను 2,104 స్కూళ్లలో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 20,490 పాఠశాలల్లో కంప్యూటర్‌ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్‌ సేవలు సమకూర్చామని చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో డిజిటల్‌ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించారు.

రోడ్డు ప్రమాదంలో

జర్నలిస్టు మృతి

బోనకల్‌: రెండు ద్విచక్ర వాహనాలు సోమవారం రాత్రి ఎదురెదురుగా ఢీకొనగా ప్రమాదంలో ఓ పత్రిక జర్నలిస్టు మృతి చెందాడు. బోనకల్‌ మండలం గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన జర్నలిస్టు మంద సత్యానందం(35) సోమవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై బోనకల్‌ వైపు వస్తుండగా రావినూతల సమీపాన వేబ్రిడ్జి వద్ద బోనకల్‌ నుంచి రావినూతల వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఘటనలో సత్యానంనందం తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బైక్‌పై ఉన్న లక్ష్మీపురం వాసులు తోటపర్తి సాయి, కాంపాటి నాగయ్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. కాగా, సత్యానందానికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలికి బోనకల్‌ ఎస్‌ఐ మాచినేని రవి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement