తల్లంపాడు వద్ద టోల్‌గేట్ మొదలుకాక ఇక్కట్లు
సోమవరం వద్ద దిగి, ఎక్కడం తప్పనిసరి
వైరా: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం – దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఇప్పటికే వైరా మండలం సోమవరం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ నుంచి వాహనాలను అనుమతిస్తుండగా తాజాగా ప్రారంభ స్థానమైన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద నుంచి రాకపోకలకు అనుమతించారు. అయితే, తల్లంపాడు వద్ద టోల్‌గేట్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో తల్లంపాడు నుంచి సోమవరం వరకు హైవేపై ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. అలాగే ముందుకెళ్తే దేవరపల్లి వద్ద దిగే సమయాన టోల్‌ఫీజుకు ఇక్కట్లు రానుండడంతో సోమవరం వద్ద కిందకు దిగి తిరిగి హైవేపైకి చేరాల్సి వస్తోంది. దేవరపల్లి నుంచి వచ్చే వాహనదారులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. రెండు వైపులా వాహనదారులు సోమవరం టోల్ పాయింట్ వద్ద దిగి నమోదు చేయించుకుని వెళ్లాల్సి రావడం, కొత్తగా వచ్చే వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లకు మలుపు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇకనైనా అధికారులు త్వరగా తల్లంపాడు వద్ద టోల్‌గేట్ అమల్లోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.


