ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆరోపించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు పథకం మినహా మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ల పెంపు, యువతకు స్కూటీల పంపిణీ తదితర హామీలు నెరవేరలేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీలోనూ లోపాలు ఉండగా, సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈమేరకు హామీల అమలు, నిధుల కేటాయింపు డిమాండ్లతో 6నుంచి 13వ తేదీ వరకు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా సీపీఐ ఆధ్వర్యాన ప్రచార జైత్ర యాత్రను నిర్వహించనున్నట్లు సురేష్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజా సమస్యలను గుర్తించడమే కాక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తల్లంపాడు వద్ద మొదలయ్యే యాత్రలు 13న ఖమ్మంలో ముగుస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, అజ్మీరా రామ్మూర్తి పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్


