ఇల్లెందు: ఇల్లెందు పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. పనిమనిషినే నిందితురాలిగా తేల్చి అరెస్ట్ చేయగా, ఇల్లెందు పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ వెంకన్నబాబు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇల్లెందు కాకతీయ నగర్‌లో పెద్దబోయిన శంకర్ దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 18న శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా, అంత్యక్రియల సమయాన ఆయన చేయించిన ఆభరణాలను గుర్తుగా తల్లి మెడలో వేయాలని కుటుంబీకులు భావించారు. తీరా బీరువా తెరిచి చూస్తే ఆభరణాలు లేకపోవడంతో అంత్యక్రియలు పూర్తయ్యాక గత నెల 30న శంకర్ కుమారుడు నగేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో ఇంటి పనిమనిషి, కారేపల్లి మండలం టేకులగూడెంకు చెందిన వేమూరి సీతను అదుపులోకి తీసుకోగా చోరీ చేసినట్లు అంగీకరించింది. గతనెల 7న యజమానులు నిద్రిస్తున్న సమయంలో బీరువా తెరిచి 11 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేయగా, గొలుసును ఇల్లెందులోని సీఎస్పీ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. మిగిలిన ఆభరణాలను సైతం ఖమ్మంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ ఉమ పాల్గొన్నారు.
బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు


