విస్తృతంగా అవగాహన
సరైన ఆహారం తప్పనిసరి
● రెండేళ్ల పాటు తల్లి పాలతో శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం ● అపోహలు విడనాడితేనే ఫలితం
జిల్లాలో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు
ఖమ్మంవైద్యవిభాగం: మాతృత్వం ఒక అందమైన అనుభూతి.. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, బిడ్డ జన్మించాక కూడా బిడ్డ ఆరోగ్యమైన ఎదుగుదల కోసం కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి పాలతో బిడ్డకు అనేక ప్రయోజనాలు ఉన్నందున అందరూ అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా పిల్లలకు తల్లి పాలు ఇస్తే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఈ మేరకు అవగాహన కల్పించేందుకు గాను ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వారోత్సవాల సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
ప్రయోజనాలను వివరించడమే లక్ష్యం
తల్లిపాలతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ఉద్దేశం. సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా తల్లిపాలు పట్టడం చాలా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. బిడ్డ పుట్టాక తల్లికి వచ్చే మొదటి పాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, కార్పొహైడ్రేట్ల వంటి ఎన్నో పోషకాలు ఉండటంతో పాటు చిన్నారి శరీరానికి కావాల్సిన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక ఈ పాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ అంశాలన్నింటిపై క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు.
పాలే వ్యాక్సిన్
ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే కాక ప్రతీ శిశువుకు జీవిత ప్రారంభం నుంచే ఆరోగ్యకరమైన పోషణ లభించేలా పర్యవేక్షిస్తారు. గర్భిణి బిడ్డకు జన్మనివ్వగానే ఆమెకు వచ్చే ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాక్సిన్ వంటిదని చెబుతారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచిస్తారు. తద్వారా బిడ్డకు సమతుల్య ఆహారం అందడంతో పాటు కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది. మనో వికాసం, మెదడు అభివృద్ధి చెందుతుంది. డయేరియా, న్యూమోనియా, కేన్సర్, గుండెజబ్బులు, ఎలర్జీ, ఆస్తమా, డయాబెటిస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే, పిల్లల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అయితే, ఉద్యోగాలు, నగర జీవనం, సోషల్ మీడియా ప్రభావం వంటి కారణాలతో చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నారు. అంతేకాక ఉద్యోగ ఒత్తిడి, సమయాభావం వారిని వేధిస్తున్నాయి. అయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తల్లిపాలే బిడ్డకు సంజీవని వంటివని చెబుతున్నారు.
బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా బిడ్డకే కాక తల్లికి కూడా ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు సూచిస్తున్నారు. శిశువుకు పాలు పట్టించడం ద్వారా తల్లి ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. రోజుకు 8–12 సార్లు తల్లిపాలు పట్టించేలా తల్లి పోషకాహారం తీసుకోవటంతో పాటు ఎక్కువ నీరు తాగుతూ తగిన విశ్రాంతి తీసుకోవాలి.
బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లి పాలే తాగించడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. శిశువుకు సరిపడా పాలు వచ్చేలా గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. ఈ విషయమై వారోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– అవిలేటి ప్రమీల, జిల్లా సంక్షేమ అధికారి
గర్భం దాల్చిన నుంచి మహిళ తనతో పాటు కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అందేలా సరైన ఆహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే శిశువులకు డబ్బా పాల అవసరమే ఉండదు. అంతేకాక పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. – డాక్టర్ పి.వసుమతీదేవి,
గైనకాలజిస్ట్, సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రి


