కారేపల్లి: మోటార్ సైకిల్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మండలంలోని ఎర్రబోడు కోయగుంపునకు చెందిన వజ్జ సునీల్ (35) ఖమ్మంలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఆదివారం తన స్నేహితుడు పాయం సాయితో కలిసి ఎర్రబోడు నుంచి కారేపల్లి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడడంతో సునీల్ తల బండరాయికి తాకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, సాయికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
చింతకాని: పని ముగించుకున్న వంట మేసీ్త్రలు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి కొణిజర్ల గ్రామానికి చెందిన వంట మేసీ్త్రలు జూపెల్లి శ్రీనివాసరావు (58), సిలివేరు రామకృష్ణ ఖమ్మంలోని ఓ శుభకార్యంలో వంట చేసేందుకు ఆదివారం వచ్చారు. పని ముగిశాక తిరిగి వెళ్తుండగా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఖమ్మం వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాసరావు మృతి చెందాడు. రామకృష్ణను కుటుంబీకులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.


