సత్తుపల్లిటౌన్: ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా బెనిఫిట్లు అందక అనారోగ్యంతో బాధపడుతున్న వారు అవస్థ ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ 2022లో ఉద్యోగ విరమణ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 21 శాతం ఫిట్‌మెంట్‌తో 2024 మే నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతం ఇస్తున్నా రిటైర్డ్ ఉద్యోగులకు అమలు చేయలేదు. ఫలితంగా 2017 పే స్కేల్ ఎరియర్లు రూ.12 లక్షలు, 2021 పే స్కేల్ ఎరియర్స్ రూ.7 లక్షలు కలిపి రూ.19 లక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాయంతో జీవనం సాగిస్తున్న ఆయన నెలనెలా చికిత్స కోసం రూ.18 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అరకొరగా వచ్చే పింఛన్ సరిపోకపోగా, తార్నాక ఆస్పత్రిలో మందులు లేక ప్రతీ రెండు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. తన జీవితం ముగియకముందే ఆర్టీసీ యాజమాన్యం బకాయిలు విడుదల చేయాలని నజీరుద్దీన్ కోరుతున్నాడు.
రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్లు ఇస్తేనే జీవితం


