● కొత్త పింఛన్లపై సీఎం ప్రకటన ● దరఖాస్తుదారుల నాలుగేళ్ల ఎదురుచూపులకు తెర ● తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు పింఛన్ ప్రకటనపై హర్షం
ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక భద్రత పింఛన్ల కోసం ఏళ్ల తరబడి కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న పేదలు, దివ్యాంగులు, బాధితుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో వచ్చేనెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఉత్సాహం నెలకొంది. గత నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాక.. దరఖాస్తులకు ఆమోదం లభించక వేలాది మంది ఆవేదన చెందుతున్నారు. తాజాగా సీఎం ప్రకటనతో కష్టాలు తీరనున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం ఉన్నతాధికారులు చేయూత పెన్షన్ల మంజూరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించగా, త్వరలోనే జిల్లాల వారీగా అర్హుల గుర్తింపు ఓ కొలిక్కి రానుందని సమాచారం.
నాలుగేళ్ల ఎదురుచూపులు..
జిల్లాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్ల నుంచి కొత్తగా ఎవరికీ పింఛన్ మంజూరు చేయకపోవడంతో వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎదురుచూపులే మిగిలాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కొత్త పింఛన్ల పంపిణీ మొదలుపెడతామని ప్రకటించడంతో.. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది.
ఈసారి కొత్తగా...
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సైతం ఊరట లభించనుంది. ప్రధానంగా తలసేమియా మేజర్, సికిల్‌సెల్ వ్యాధులతో సతమతమవుతున్న వారికి కూడా పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటింఇంది. జిల్లా వ్యాప్తంగా ఈ రెండు వ్యాధులతో బాధపడుతున్న వారు 1,700 మంది ఉంటారని అంచనా. తలసేమియా మేజర్ 500 మంది, సికిల్‌సెల్ బాధితులు 1,200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీనెల రక్తమార్పిడి, ఇతర వైద్య ఖర్చులు భారంగా మారడంతో వీరి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం వీరికి ఇచ్చే పింఛన్ కొండంత అండగా నిలవనుంది.
వేల మంది దరఖాస్తులు..
ఖమ్మం జిల్లాలో దాదాపు 20వేల మందికి పైగా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాలు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఆయా దరఖాస్తులను అధికారులు ఇప్పటికే పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం జాబితా వెల్లడించే అవకాశముంది. అంతేకాక ఇంకా అర్హులు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారని సమాచారం.


