● ఒకేసారి మూడు నెలల కోటా సరఫరా ● 748 రేషన్ షాపులకు 196 దుకాణాలకే చేరిన స్టాక్ ● గత నెల నిల్వలతో పంపిణీ ప్రారంభానికి నిర్ణయం
ఖమ్మం సహకారనగర్: కేంద్రప్రభుత్వ సూచనలతో రాష్ట్రంలోని రేషన్‌షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావమైనా, భారీ వర్షాలు వచ్చినా ఇక్కట్లు ఎదురుకాకుండా ఈనెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటా బియ్యం పంపిణీకి నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్ పౌర సరఫరాల శాఖాధికారి మల్లికార్జున్‌బాబు పంపిణీకి సంబంధించి ఉద్యోగులు, డీలర్లతో సమీక్షించారు. కాగా, లబ్ధిదారులకు ఇక్కట్లు ఎదురుకాకుండా ఈసారి బియ్యం పంపిణీ నెలాఖరు వరకు కొనసాగనుంది.
షాప్‌లకు చేరింది 14.70శాతమే
బియ్యం పంపిణీని శనివారం నుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో 748 రేషన్ షాప్‌లకు గాను ఇప్పటి వరకు 196 దుకాణాలకే బియ్యం చేరాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి 3,580.452 (14.70 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం చేరగా.. మిగతా 20,778.890మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దశల వారీగా సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, పంపిణీ మాత్రం శనివారమే మొదలుపెట్టాలని నిర్ణయించడంతో షాపుల్లో గత నెల మిగిలిన బియ్యం సరఫరా చేయాలని డీలర్లకు సూచించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జున్‌బాబు తెలిపారు. కొత్త సాఫ్ట్‌వేర్(స్మార్ట్ సప్లయి చైన్ మేనేజ్‌మెంట్) అమలులో సాంకేతిక సమస్యల కారణంగా సరఫరాలో జాప్యం జరిగిందని, వీలైనంత త్వరగా షాపులకు సరిపడా బియ్యం చేరవేస్తామని ఆయన వెల్లడించారు.


