వచ్చాం.. వెళ్లాం..
● తనిఖీ సమయానికి సిద్ధం చేసినట్లు అనుమానాలు ● తుదిదశకు టెస్కాబ్, డీసీసీబీ అధికారుల విచారణ
సత్తుపల్లి: పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో టెస్కాబ్, డీసీసీబీ అదికారులు చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. ఈ సందర్భంగా అధికారులు గురు, శుక్రవారం రికార్డులను పరిశీలించడమే కాక సత్తుపల్లి మండలంలోని 13యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, తప్పు బయటపడకుండా అప్పటికప్పుడు పలువురు యూనిట్లు ఏర్పాటుచేశారనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ ఈ విషయాన్ని తాము నిర్ధారించలేమని టెస్కాబ్ డీజీఎం సంపత్‌కుమార్, ఏజీఎం మణికాంత్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం రుణాలు ఇచ్చారా.. ఏ అర్హతలతో తీసుకున్నారనేది తేలేవరకు విచారణ కొనసాగుతున్నట్లేనని తెలిపారు. కాగా, సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్‌లో రికార్డుల పరిశీలన తర్వాత ఖమ్మం కేంద్ర కార్యాలయంలో కూడా అవసరమైన రికార్డులు పరిశీలిస్తామని చెప్పారు.
సబ్సిడీ కొందరికే..
పీఎంఈజీపీ రుణాల సబ్సిడీ కొందరికే అందినట్లు విమర్శలు వస్తున్నాయి. సదాశివునిపాలెంలో వినుకొండ అశోక్ 2022లో సిటీ కేబుల్ నిర్వహణ కోసం రూ.5 లక్షలురుణం తీసుకుని పూర్తిగా చెల్లించడమే కాక ఇంకా నిర్వహిస్తున్నాడు. కానీఆయనకు ఇప్పటికీ సబ్సిడీ విడుదల కాలేదు. ఇదే గ్రామంలో మూడు రుణాలు తీసుకున్న వ్యక్తి యూనిట్లు పెట్టకున్నా సబ్సిడీ విడుదలైంది. అధికారుల తనిఖీ నేపథ్యాన సదరు వ్యక్తి ఇంకొకరి గేదెలను తీసుకొచ్చి డెయిరీ ఫామ్‌గా సిద్ధం చేశాడు. కాగా, అధికారులు ఆయన యూనిట్‌ను పరిశీలించకపోగా, అశోక్ యూనిట్‌ను తనిఖీ చేయడం గమనార్హం. ఇక సత్తుపల్లికి చెందిన యనమాల అజయ్ డీజే యూనిట్ కోసం రూ.6 లక్షలు రుణం ఓ బ్యాంక్‌లో తీసుకోగా, రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి సబ్సిడీ వచ్చాక మిగిలిన రూ.లక్ష కలిపి ఇస్తామని చెప్పారు. నాలుగేళ్లు గడుస్తున్నా విడుదల కాలేదు. అధికారుల తనిఖీ నేపథ్యాన నారాయణపురంలో బాలాజీ టెంట్‌హౌస్ వద్ద ఓ వర్గానికి చెందిన కొందరు మోహరించి అవాంతరాలు రాకుండా చూసుకున్నట్లు సమాచారం. అంతేకాక పక్కనే ఉన్న గీతా టెంట్‌హౌస్ ఫ్లెక్సీని తొలగించినట్లు తెలిసింది. సదాశివునిపాలెంలో ఆరు యూనిట్లను పరిశీలిస్తారని భావిస్తే అంతా బాగున్న సిటీకేబుల్‌నే పరిశీలించడం, తుంబూరులో ఒకే యూనిట్‌ను పరిశీలించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సబ్సిడీ రుణాల్లో అవకతవకలు జరిగాయని పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈమేరకు టెస్కాబ్ అధికారులు ఎంత వేగంగా వచ్చారో.. అంతేవేగంగా విచారణ ముగించడం, వివరాలను బయటకు చెప్పడానికి వారు జంకడం కనిపించింది. అలాగే, యూనిట్ పరిశీలన సమయాన వివరాలు ఆరా తీయకుండా ఫొటోలు తీసుకొని వెళ్లారు. విచారణ తూతూ మంత్రంగా సాగేలా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రుణ గ్రహీతలంతా ఒకటవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్న ప్రచారం జరుగుతోంది.


