● తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం నుంచి 8వ తేదీ వరకు ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ‘అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్‌మెంట్’ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 18 మంది అధికారులు వెళ్తుండగా.. తెలంగాణ నుంచి హాజరవుతున్న ఇద్దరు ఐఏఎస్ అధికారుల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు కేఎంసీ కమిషనర్ అభిషేక్ ఉన్నారు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జరిగే సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయన కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. తద్వారా ఇజ్రాయిల్‌లో ఆధునిక నీటి నిర్వహణ విధానాలు, పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థలపై అవగాహన పెంపొందించుకుని, అందులో అనువైన విధానాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిసింది.
29 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఖమ్మంక్రైం: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 29మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు భద్రాది జోన్ డీఐజీ శ్వేత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో కాంపల్లి మోహన్‌రావు, ఏ.కృష్ణయ్య, ఎన్.స్వప్న, టి.శ్రీనివాసరావు, జి.సుబ్బారావు, సీహెచ్.ముత్తయ్య, షేక్ అమీద్, డి.రాధ్యా, ఎం.హరిబాబు, వి.రమాదేవి, బి.వెంకటనారాయణ, డి.ప్రసాద్‌రావు, బి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసరావు, ఎం.డీ.ఖాజామియా, జి.సురేష్‌కుమార్, సీహెచ్.సైదమ్మ, జె.జానయ్య, ఎం.వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, ఎస్.సుధాకర్, పి.శ్రీనివాసరెడ్డి, సీహెచ్.దాసు, సయ్యద్ మన్సూర్‌అలీ, జి.వెంకటయ్య, ఎం.డీ.అబ్దుల్‌ఘనీ, పి.వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరికి వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మెరుగ్గా ఆయుష్
వైద్యసేవలు
● లోక్‌సభలో ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోని గ్రామీణ ప్రజలకు ఆయుష్ వైద్యసేవలు విస్తృతంగా అందుతున్నాయని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా మంజూరైన అన్నికేంద్రాలు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మొత్తం 421 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాలు మంజూరు కాగా.. పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో 1,30,25,792 మంది ప్రజలు ఈ కేంద్రాల ద్వారా సేవలు పొందారని తెలిపారు. గ్రామీణులకు అల్లోపతితో పాటు ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి(ఆయుష్) వైద్యవిధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
గోదావరి జలాలకు బ్రేక్
వైరా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కొద్దిరోజుల నుంచి వైరా రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అయితే, గోదావరికి ప్రవాహం పెరగడంతో ముందు జాగ్రత్తగా చర్యలను మోటార్లను ఆఫ్ చేయడంతో శుక్రవారం రిజర్వాయర్‌లోకి నీటి రాక నిలిచిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 17.3 అడుగుల మేర నీరు ఉంది. గోదావరి జలాల రాక నిలిచిపోవడంతో ఇన్నాళ్లు వరి నారుమళ్లకు నీరు విడుదల చేసిన అధికారులు, నాట్లు వేసుకునేందుకు విడుదలపై ఏ నిర్ణయం తీసుకుంటారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
‘నవోదయ’ దరఖాస్తు గడువు పొడిగింపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతూ ప్రవేశపరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


