
‘సంకల్ప’ బలానికి సన్మానం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ ఖమ్మం డిపోలో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తలసేమియా చిన్నారులకు సేవలందిస్తున్న అప్పికట్ల(ప్రొద్దటూరి) అనితను సంస్థ ఎండీ వీ.సీ.సజ్జనార్ సత్కరించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉద్యోగులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అందులో భాగంగా అనిత, ఆమె భర్త ప్రొద్దుటూరి రవిచంద్ర, వారి కుమార్తెలను ఎండీ సత్కరించి అభినందించారు. అనిత చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంస్థ అండగా ఉంటుందని, వారికి కావాల్సిన సహకారం అందిస్తామని సజ్జనార్ తెలిపారు. కాగా, సన్మానం అందుకున్న అనితను ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్, డిపో మేనేజర్ దినేష్‌కుమార్, అధికారులు, ఉద్యోగులు అభినందించగా.. తన సేవలకు గుర్తింపు ఇవ్వడంపై యాజమాన్యం, ఎండీ సజ్జనార్, ఆర్‌ఎంకు అనిత కతృజ్ఞతలు తెలిపారు.
మున్నేటిని పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మంఅర్బన్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండడంతో మున్నేటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యాన పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మంలో మున్నేటిని శుక్రవారం పరిశీలించిన ఆయన గత అనుభవాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతమైతే లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తెలిపారు.
మున్నేటి నీటిమట్టం 10.30 అడుగులు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో శుక్రవారం పెద్దగా వర్షం లేకున్నా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 11.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 5గంటలకు 10.30 అడుగులకు పడిపోయింది. అయితే, జిల్లాలో శుక్రవారం రాత్రి వర్షం కురవగా.. బయ్యారం చెరువు, కొత్తగూడ, గార్ల, పాకాల తదితర ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో శనివారం ఉదయంకల్లా మున్నేరులో నీటిమట్టం కాస్త పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

‘సంకల్ప’ బలానికి సన్మానం

‘సంకల్ప’ బలానికి సన్మానం