
రాత్రయితే.. రచ్చరచ్చ
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో రౌడీమూకల ఆగడాలు ● ఓ పక్క చోరీలు, ఇంకోపక్క అల్లర్లతో జనం ఆందోళన ● పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని వినతులు
ఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా అల్లరిమూకలు శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఓ పక్క చోరీలు సర్వసాధారణం కాగా.. రౌడీమూకలు, గంజాయి సేవిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న వారి కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రయితే చాలు గంజాయి సేవించి ఆ మత్తులో 24గంటల తెరిచే ఉండే బెల్ట్‌షాప్‌లకు వస్తున్న వారు చేసే గొడవలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసు పెట్రోలింగ్ నామమాత్రంగా సాగుతుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
దొంగల విజృంభణ
ఇటీవల జరుగుతున్న చోరీలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాత నేరస్తులే కాక ఇతర ప్రాంతాలకు నుంచి ముఠాలు వచ్చినట్లు తెలుస్తుండగా.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా రాత్రింబవళ్లు దోచుకోంటున్నారు. ఖమ్మం శివారు గొల్లగూడెం, మధురానగర్ ప్రాంతాలో ఇటీవల ముసుగు ధరించిన వ్యక్తులు తిరుగుతున్న సీసీ పుటేజీలు వైరల్‌గా మారాయి. అలాగే, సత్తుపల్లిలోని సింగరేణి క్వార్టర్స్‌లో దొంగలు చొరబడ్డారు. గతంలోనూ క్వార్టర్స్‌లో చోరీ జరిగినా పోలీస్ నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో రెక్కీ చేసి మరీ చోరీలకు పాల్పడే ముఠాల సంచారంపైనా పోలీసు నిఘా లేదని తెలుస్తోంది.
నడిరోడ్డుపై గొడవలు
జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలలో అసాంఘిక శక్తులు మద్యం, గంజాయి మత్తులో ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై బైఠాయించి వాహనాలను ఆపుతూ తమనెవరూ ఏమీ చేయలేరని, తమ వెనుక నాయకులు ఉన్నారంటూ ప్రజలను బెదిరిస్తున్నారు. గంజాయితోపాటు మద్యం మత్తులో ఉన్న వీరిని ఏమీ చేయలేక స్థానికులు వణికిపోతున్నారు. గత మంగళవారం రాత్రి గోపాలపురం ప్రధాన రహదారిపై వైఎస్సాఆర్ నగర్‌కు చెందిన కొందరు ఆకతాయిలు గంజాయి, మద్యం మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో పోలీసు సిబ్బంది వచ్చినా తమనెవరూ ఏమీ చేయలేరని, అధికార పార్టీ నాయకులు తమకు ఉన్నారని గట్టిగా కేకలు వేయడం గమనార్హం. అయితే వైఎస్సార్ నగర్ ప్రాంతంలో చాలా కాలంగా ఆకతాయిలు ఆగడాలు పెచ్చుమీరినట్లు తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు మొక్కుబడిగా మందలించి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసు నిఘా ఎక్కడ?
కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పోలీస్ తగ్గిందని తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఆకతాయిలు పుట్టిన రోజు, ఇతర వేడుకలను రోడ్లుపైనే నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా ఇతర పట్టణాల శివార్లలో తెల్లవారు మద్యం సేవిస్తూ దాబాల వద్ద సైతం వీరంగం చేస్తున్నారని సమాచారం. ఇదంతా పోలీసుల దృష్టిలో ఉన్నా పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా పోలీసులు నిఘా పెంచి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.