
ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తాం..
కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్ అనిల్‌కుమార్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. కారేపల్లి మండలం సూర్యతండాలో అనిల్ కుటుంబాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌తో కలిసి శుక్రవారం ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని ఎంపీ తెలిపారు. కాగా, అనిల్ సతీమణి రేణుక బీటెక్ పూర్తిచేయగా ఎనిమిది నెలల కుమారుడు ఉన్నందున ఆదుకోవాలని స్థానికులు కోరారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి
కారేపల్లి రైల్వేస్టేషన్‌లో వసతులు కల్పించడమే కాక అవసరమైన రైళ్ల హాల్టింగ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. స్టేషన్‌ను శుక్రవారం ఆయన పరిశీలించగా కరోనాకు ముందు నడిచిన రైళ్ల పునరుద్ధరణ, ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్‌పై స్థానికులు విన్నవించారు. దీంతో ఎంపీ సానుకూలంగా స్పందించారు. మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, సురేందర్ మణియార్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోనీవీరప్రతాప్, బానోతు పద్మావతి, మాలోతు ఈశ్వరీనందరాజ్, హేమలత, మల్లేల నాగేశ్వరరావు, వినోద్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి