
పక్కాగా నిధుల వ్యయం
నాణ్యతగా, వేగంగా...
● జూనియర్ కాలేజీలకు రూ.2.96 కోట్లు ● పనుల పర్యవేక్షణకు ‘అమ్మ ఆదర్శ కమిటీలు’
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కొన్నాళ్ల క్రితం అమ్మ ఆదర్శ కమిటీలను నియమించారు. ఇదే తరహాలో జూనియర్ కాలేజీలకు సైతం కమిటీలను నియమించి పనుల పర్యవేక్షణ అప్పగించారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టే పనులు నాణ్యతగా జరగడమే కాక నిధులు లెక్క పక్కాగా ఉంటుందని భావిస్తున్నారు.
వసతుల కల్పన పరిశీలన
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులు నాణ్యతగా జరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఈ కమిటీలు ఉండగా జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి వచ్చాయి. కాలేజీ ఉన్న ప్రాంత సీ్త్ర శక్తి మహిళా సంఘాల సభ్యులే కాక విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ కమిటీలు నియమిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమేకాక ఫ్యాన్లు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, మరమ్మతు వంటి అత్యవసర పనులను ఈ కమిటీల పర్యవేక్షణలో చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, విద్యార్థులంతా హాజరయ్యే అధ్యాపకులకు ఈ కమిటీల సభ్యులు సహకరిస్తారు.
15 కాలేజీలకు రూ.2.96 కోటుల
జిల్లాలో 21ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 15 కాలేజీలకు రూ.2.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ కాలేజీకి కనీసం రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, వైరా, బనిగండ్లపాడు, కారేపల్లి, కామేపల్లి, పిండిప్రోలు, ముదిగొండ, నయాబజార్, ఖమ్మం బాలికల కాలేజీ, శాంతినగర్, నాగులవంచ, బోనకల్ కళాశాలలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులో చేపట్టే పనులను మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ స్థాయిలో రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తుండగా అదనంగా అమ్మ ఆదర్శ కమిటీలను సైతం నియమించారు. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 25 శాతం మేర విడుదల కాగా.. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలకు మంజూరైన నిధులతో చేపట్టే పనులు నాణ్యతగానే కాగా త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. రెండు నెలల్లో పనులన్నీ పూర్తిచేయాలనేది లక్ష్యం. తద్వారా కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీలు చూస్తాయి.
– కె.రవిబాబు, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి

పక్కాగా నిధుల వ్యయం