
వాగు హోరు.. వేట జోరు!
కూసుమంచి మండలం నర్సింహులగూడెం వాగులో చేపలు పడుతున్న స్థానికులు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతుండగా వరదతో పాటే చేపలు కొట్టుకొస్తున్నాయి. దీనికి తోడు శుక్రవారం డ్రై డే కావడంతో మాంసం, చికెన్ దుకాణాలు మూసివేశారు. ఈమేరకు వాగుల వద్ద స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు.
కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం వద్ద వాగులో చేపలవేటకు పెద్దసంఖ్యలో జనం రావడంతో సందడి నెలకొంది. అలాగే, నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, ముజ్జుగూడెం, అనాసాగారం, నాచేపల్లి, చెరువుమాధారం తదితర గ్రామాల్లోనూ స్థానికులు చేపలు వేటాడారు. చాలామందికి సరిపడా కంటే ఎక్కువ చేపలు లభించడంతో వాగుల వద్దే కిలో రూ.100 చొప్పున విక్రయించారు.
– కూసుమంచి / నేలకొండపల్లి