ఖమ్మంసహకారనగర్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని, రూ.100 వెరిఫికేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
టెన్నిస్ విజేతలకు బహుమతులు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా జరుగుతున్న లాన్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ బాధ్యులు సత్యనారాయణ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు.
‘శాయ్’ తనిఖీ తర్వాతే
సింథటిక్ ట్రాక్ పనులు..
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆధునిక సింథటిక్ ట్రాక్ పనులను ఇప్పటికే జిల్లా యువజన క్రీడల శాఖ లాంఛనంగా ప్రారంభించింది. అయితే, భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా నిర్దేశిత నమూనాలతో నాణ్యతగా పనులు జరిగేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) అధికారులు పరిశీలించాకే పనులు మొదలు కానున్నాయని తెలిపారు. దీంతో శాయ్ అధికారులు ఎప్పుడు వస్తారని కాంట్రాక్టర్ ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. ఇప్పటికే ట్రాక్ చుట్టు మట్టి తవ్వకం పూర్తిచేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ముదిగొండ: పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. కోదాడ – ఖమ్మం జాతీయ రహదారిపై గేదెను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలో కార్పెంటర్ పనులు ముగించుకుని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు నేలకొండపల్లి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో ముదిగొండ సమీపానికి రాగానే రహదారిపై గేదెలను గమనించక బైక్ ఢీకొట్టడంతో వెనక కూర్చున్న గోవిందాచారి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలయ్యాయి.
విద్యుదాఘాతంతో
యువకుడు..
ఖమ్మం అర్బన్: కరెంట్ షాక్తో చేపలు పట్టే ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 8వ డివిజన్ ఎల్బీనగర్‌కు చెందిన తురాయి రాజు(28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం అతడు తన స్నేహితులు సైదులు, తురాయి వీరభద్రం, తురాయి శివలతో కలిసి ఇంటికి సమీపంలో ఉన్న ఎన్నెస్పీ కాలువ వద్ద కరెంట్ షాక్తో చేపలు పట్టేందుకు వెళ్లారు. కాలువ పక్కన ఉన్న కరెంట్ లైన్‌పై విద్యుత్ తీగను వేసి చేపలు పడుతుండగా రాజు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. వెంటనే విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోవడంతో స్నేహితులు అతడిని బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించగా.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ సీఐ ఆర్.భానుప్రకాష్ తెలిపారు.
కారు పల్టీకొట్టి డ్రైవర్..
కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం ఓ కారు పల్టీ కొట్టగా.. ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం (25) గురువారం హైదరాబాద్ నుంచి ఖమ్మానికి కారులో వస్తుండగా.. జీళ్లచెరువు ఫ్‌లైఓవర్ పైకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈఘటనలో ఇబ్రహీం అక్కడికక్కడే మృతిచెందగా.. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహకారంతో పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


