ప్రభుత్వ స్థలాలు కావలెను..
● వైరాలో కార్యాలయాలకు కొరత ● భవనాలు మంజూరైనా స్థలాలు లేక ఏర్పాటులో జాప్యం ● ఎంవీఐ కార్యాలయం తరలింపునకు నిర్ణయం
వైరా: రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాఖల వారీగా వైరా నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కానీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న స్థలాల రక్షణపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రభుత్వ భూములను అక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాలనుకున్నా రాజకీయ ఒత్తిడి ఎదురవుతోంది.
స్థలాల కోసం వెదుకులాట
వైరా మండలంలో 22 పంచాయతీలు, మూడు శివారు గ్రామాలు న్నాయి. నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఉన్నా.. పట్టణ పరిధిలో ఎక్కువగా ఎన్నెస్పీ స్థలాలే ఉన్నాయి. రెవెన్యూ శాఖ పరిధిలో మండలంలోని ముసలిమడుగు, రెబ్బవరం, గరికపాడు, విప్పలమడక, బ్రాహ్మణపల్లి, సోమవరం, స్టేజీపినపాక ప్రాంతాల్లో ఎకరం మించి ప్రభుత్వ భూములు లేవు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సరిపడా భూమి లేక ఉన్న వాటిలోనే సర్దుకుంటున్నారు. ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం 15 ఏళ్లుగా అద్దె భవనంలోనే నిర్వహించారు. చివరకు నిర్వహణ భారంగా మారడంతో ఇటీవలే పాత పంచాయతీ కార్యాలయంలోకి తరలించారు. అలాగే, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తుండగా.. ఫైర్‌స్టేషన్‌ను వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలోని ఒక భవనంలో ఏర్పాటుచేశారు. ఫలితంగా ఫైరింజన్‌కు షెడ్డు లేక వానకు తడుస్తూ, ఎండకు ఎండుతోంది. ఇదే ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం కూడా నిర్వహిస్తుండగా ఇరుకు భవనం కావడం, టాయిలెట్ సదుపాయం కూడా లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఏఓ కార్యాలయాన్ని రేకుల షెడ్డులోనే నిర్వహిస్తుండగా, మత్స్య విత్తనాభివృద్ధి భవనం శిథిలావస్థలోకి చేరింది. ఇలా చాలా కార్యాలయాలకు సరైన భవనాలు లేకపోగా.. ప్రభుత్వ స్థలాల కొరతతో నిధులు మంజూరైనా నిర్మాణానికి ముందుకు సాగడం లేదు.
రెబ్బవరానికి ఎంవీఐ ఆఫీస్
30 ఏళ్ల క్రితం ఎన్నెస్పీ పాత భవనంలో రవాణాశాఖ యూనిట్ కార్యాలయం ఏర్పాటు చేయగా అది శిథిలావస్థకు చేరింది. అలాగే, ఈ భవనాన్ని ఆనుకుని వంద పడకల ఆస్పత్రి భవనం నిర్మాణం చేపట్టడం, భవనానికి ప్రధాన రహదారి రవాణా శాఖ కార్యాలయం నుంచే ఇవ్వడంతో సమస్య ఎదురైంది. దీంతో కార్యాలయాన్ని రెబ్బవరంలోని మూడెకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రెబ్బవరానికి ఎంవీఐ కార్యాలయం తరలిస్తే అటు మధిర నియోజకవర్గం, ఇటు ఇటు వైరా, మరోపక్క సత్తుపల్లి మండలంలోని తల్లాడ వాసుల ఇక్కట్లు తీరతాయని.. అక్కడ డ్రైవింగ్ టెస్టు ట్రాక్ కూడా ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
సబ్‌స్టేషన్లకు కూడా..
రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని వైరాకు రెండు విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేశారు. కానీ వీటి నిర్మాణాలకు స్థలాలు లేక అధికారులు అన్వేషణలో పడ్డారు. మండలంలోని విప్పలమడకలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం మూడెకరాలు స్థలాన్ని మాత్రం గుర్తించగలిగారు.
సర్వే చేస్తున్నాం..
వైరా మండలంలో ప్రభుత్వ భూముల గుర్తింపునకు సర్వే చేస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్లకు తొలుత స్థలాలు గుర్తించనున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి భూములు ఆయా శాఖలకు అప్పగిస్తాం.
– కే.వీ.శ్రీనివాసరావు, తహసీల్దార్, వైరా
ప్రభుత్వ స్థలాలు కావలెను..


