వైభవంగా వేంకటేశ్వరస్వామి తిరునక్షత్ర వేడుకలు
ఏన్కూరు: మండలంలోని నాచారం–రేపల్లెవాడ గ్రామాల మధ్య స్వయంభూగా వెలసిన అద్భుత వేంకటేశ్వర స్వామివారి 23వ తిరు నక్షత్ర వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, పుణ్యావాచనం, రక్షాబంధనం, 108 కలశాలతో ఆభిషేకం, మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు నల్లాన్‌చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, సత్యనారాయణాచార్యులు, తిరుమల సత్యనారాయణాచార్యులు ప్రత్యేక పూజలు చేయగా ఆలయ నిర్మాణ దాత మొగిలి శ్రీనివాసరెడ్డి దంపతులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరయ్యారు.
ముగిసిన డీడీఎన్
దరఖాస్తు గడువు
● ఉమ్మడి జిల్లాలో
210 ఆలయాల నుంచి దరఖాస్తులు
ఖమ్మంగాంధీచౌక్: దేవాలయాల నిర్వహణ కోసం రూపొందించిన ధూప దీప నివేదన(డీడీఎన్) పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. ఈనెల 1న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 210 ఆలయాల నుంచి దరఖాస్తులు అందాయి. ఇందులో ఖమ్మం జిల్లా నుంచి 145, భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి 65 దరఖాస్తులు ఉండగా, అధికారులు పరిశీలనప్రారంభించారు. కనీసం 15ఏళ్ల చరిత్ర కలిగి, దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయిన ఆలయాల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తుండగా, అర్హత ఉన్న వాటి దరఖాస్తులను రాష్ట్ర కమిషనర్‌కు నివేదికను పంపిస్తారు. ఆతర్వాత ఆలయాలకు పడితరం(ధూప దీప నివేదన) కింద రూ.4 వేలు, అర్చకుల గౌరవ వేతనంగా రూ.6 వేలు అందిస్తారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 450 దేవాలయాలకు అమలవుతోంది.
నేటి నుంచి శిక్షణ
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న 647 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి జూలై 26వ తేదీ వరకు (పనిదినాల్లో) 50రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. టీటీడీసీలో 217 మందికి, ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో 215 మందికి, ప్రభుత్వ పీజీ కళాశాలలో 215 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తుదారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. 21 మంది సర్వేయర్లతో పాటు ఆరుగురు రిటైర్డ్ సర్వేయర్లతో శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన శిక్షణ కేంద్రానికి వచ్చే సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు మరొక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం సువర్ణ పుష్పార్చ నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశాక.. స్వామివారికి కంకణఽ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణఽ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


