శాంతిభద్రతల సమస్య తేవొద్దు
రాష్ట్ర వ్యవసాయశాఖా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి: హవాలా, సైబర్‌క్రైం, పేకాట, కోడిపందేలతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, మంచి చేయకపోయినా సరే కానీ.. ఇలాంటి చర్యలతో సత్తుపల్లికి చెడు పేరు తేవొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన) తనయుడు మధుమోహన్‌రెడ్డి అందించిన రూ.1.50 కోట్లతో గంగారం పంచాయతీ సమీకృత భవనం, డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యక్తిత్వాన్ని బట్టే విలువ ఉంటుందని, పంచాయతీ ఎన్నికల్లో రూ.కోట్టు ఖర్చుపెట్టినా ప్రజాదరణ ఉన్నవారే ఎన్నికయ్యారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావును ఆదర్శంగా తీసుకుని పని చేయడం వల్లే తాను చేసిన అభివృద్ధి పనులు ప్రతీ గ్రామంలో కనిపిస్తున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సలహాలు, సూచనల మేరకు అధికారులు పనిచేస్తూ అభివృద్ధిలో ముందుంచాలని అన్నారు.
మధుమోహన్‌రెడ్డి అభినందనీయుడు..
రెండేళ్ల నుంచి గంగారంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాసరి మధుమోహన్‌రెడ్డి అభినందనీయుడని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సొంత డబ్బులతో గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మధుమోహన్‌రెడ్డికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు కాకర్ల రేవతి, మౌనికారెడ్డి, దోమ ఆనంద్ పాల్గొన్నారు.


