ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారమచంద్రస్వామి వారు ఆదివారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధమనోహర రూపం.. కిరీటంపై నెమలి ఈకలతో బంగారపు ఊయలలో ఊగుతున్న స్వామివారికి భక్తులు నీరాజనం పలికారు. పగల్‌పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న స్వామివారి ఆవతారాలు ఆదివారంతో ముగిశాయి.
నేడు తెప్పోత్సవం
శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు పవిత్ర గోదావరిలో సోమవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేడుకలకు హంస వాహనాన్ని అలంకరించారు. అధ్యయనోత్సవాల్లో పదో రోజు రామయ్య జల విహారం చేయనుండగా, ఆగమంలో దీన్ని ప్లవోత్సవంగా పేర్కొంటారు. వ్యవహారిక భాషలో తెప్పోత్సవంగా పిలుస్తారు. తెప్పోత్సవానికి ఏర్పాటు పూర్తి చేశామని ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. కాగా, సోమవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు సేవాకాలం, తిరుమంగై ఆళ్వారుల పరమపదోత్సవం, 1 నుంచి 2 గంటల వరకు రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి సేవ, పగల్‌పత్తు ఉత్సవాల సమాప్తి, 3గంటలకు దర్బారుసేవ నిర్వహిస్తామని వివరించారు.


