మహిళా హక్కుల పరిరక్షణకు ఓల్గా కృషి
ఖమ్మంగాంధీచౌక్: సామాజిక అసమానతలు, పితృస్వామిక భావజాల అణచివేతల సారమే ఓల్గా రచనలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఆమె విశేష కృషి చేశారని ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు ఆచార్య సి.మృణాళిని అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘ఓల్గా సాహిత్య సమాలోచన’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో సీ్త్రవాద అస్తిత్వ స్పృహతో ఓల్గా అనేక రచనలు చేశారని తెలిపారు. కథా రచయిత్రి వి.ప్రతిమ మాట్లాడుతూ.. ఓల్గా రచనలు సీ్త్రల సాధికారత, అస్తిత్వ చైతన్య ప్రకటనగా కనిపిస్తూనే సమాజంలోని కుటుంబ రాజకీయ సాంస్కృతిక ప్రభావాన్ని, వాటి స్వరూపాలను ఆవిష్కరించారని తెలిపారు. రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. సమాజంలోని సామాజిక సంక్లిష్టతే తన రచనల నేపథ్యమని తెలిపారు. సీ్త్రల మధ్య సహకారం ఉండాలని, మహిళలను సంఘటితం చేసేందుకే తన రచనలు సాగాయని చెప్పారు. తొలుత ఓల్గా రచనల సారాంశ పోస్టర్లను న్యాయవాది పి.సంధ్యారాణి ప్రారంభించారు. ‘ఓల్గా రాజకీయ కథలు – విశ్లేషణ’ అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రచయిత్రులు వి.సునంద, పాటిబండ్ల రజని, డాక్టర్ కె.ఆనందవాణి, నాగమణి, జతిన్‌కుమార్, సాహితీవేత్తలు అక్కినేని కుటుంబరావు, రవిమారుత్, కె.ఆనందాచారి, ఆర్.పార్వతీరెడ్డి, జి.సౌభాగ్య, కె.శైలజ, ఎస్.రాధికారెడ్డి, ఫణి మాధవి, ఎస్.స్పందన, టి.లక్ష్మి పాల్గొన్నారు.


