ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలను ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పార్టీ జెండా ఆవిష్కరించాక కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ ఎదగడానికి కాంగ్రెస్సే కారణమని తెలిపారు. జనవరి 26న పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని, ప్రతీ కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నగర పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సుభాష్ ఎక్కర, మహ్మద్ జావేద్, చోటాబాబా, వడ్డెబోయిన నరసింహారావు, యడ్లపల్లి సంతోష్, అంజనీకుమార్, దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, బొడ్డు బొందయ్య, శేఖర్‌గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, బాలగంగాధర్ తిలక్, దొండపాటి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు, రాపర్తి శరత్, వైష్ణవి ప్రసన్నకృష్ణ పాల్గొన్నారు.
అభివృద్ధిలో మధిర ముందంజ
మధిర: స్వాతంత్య్ర పోరాటం నుంచి గొప్ప చరిత్ర కలిగిన మధిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపరు. మధిరలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరానికి మధిరలోనే పునాది పడగా, ఎందరో సమరయోధులకు ఆశ్రయం కల్పించింది ఇక్కడేనని తెలిపారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ఆవిష్కరించకుండా నిజాం ప్రభుత్వం నిషేధం విధిస్తే సర్దార్ జమలాపురం కేశవరావు మారువేషంలో మధిరలో మూడు రంగుల జెండా ఎగురవేశారని, తొండలగోపవరం కేంద్రంగా నల్ల మల గిరిప్రసాద్ నిజాం వ్యతిరేక పోరాటం నడిపారని గుర్తు చేశారు. అయితే, ఓ పక్క ఏరు, మరో పక్క చెరువుతో మధిర విస్తరణకు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యాన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పనుల్లో నాణ్యత లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, విద్యుత్ అంతరాయాలు ఎదురుకాకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక పట్టణాల్లో పేదల కోసం జీ ప్లస్ విధానంలో హౌసింగ్ కాలనీలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. కాగా, మధిరలో డిగ్రీ, జూనియర్ కళాశాలు, హైస్కూల్‌కు కొత్త భవనాలు మంజూరు చేయగా, త్వరలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ పనులకు భూమి పూజ చేస్తానని తెలిపారు. అంతేకాక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను మంజూరు చేశామని, మహిళా సంఘాల్లో సభ్యులకు స్వయం ఉపాధి కల్పన కోసం సబ్బులు, అగరబత్తీ తయారీ కేంద్రానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు భట్టి వెల్లడించారు. కాగా, రాజకీయాలు ఎన్నికల వరకే అని, ఆ తర్వాత మధిర పట్టణాభివృద్ధే లక్ష్యమని వెల్లడించిన భట్టి.. పార్టీల నాయకులు, మేధావులు, విద్యావంతులు తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భట్టి విక్రమార్క జెండా ఆవిష్కరించారు.
డీసీసీ కార్యాయలంలో కేక్ కట్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు


