‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం
ఖమ్మం సహకారనగర్ : విద్యారంగంలో స్ఫూర్తి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లికి చెందిన పేద విద్యార్థి తేజవత్ శ్రీనివాస్‌కు ఫౌండేషన్ అందించిన రూ. 50వేల చెక్కును శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కాన్పూర్ ఐఐటీలో శ్రీనివాస్ అడ్మిషన్ పొందగా, ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఆ కోర్సు చదివే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇటీవల కలెక్టరేట్‌లో ప్రజావాణిలో అధికారులకు విన్నవించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆ విద్యార్థికి ఆర్థిక సాయం బాధ్యతను విద్యాశాఖ సీఎంఓ రాజశేఖర్‌కు అప్పగించారని తెలిపారు. దీంతో ఆయన సూచన మేరకు స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఐఐటీ చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తామని ముందుకొచ్చారని, ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి వరక రామారావు తొలివిడతగా రూ. 50 వేల చెక్కు ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ వలంటీర్లు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, బైర్ల వెంకటేశ్వర్లు, శిరసాని ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్
ముజమ్మిల్ ఖాన్


