భూలోక వైకుంఠమే.. | - | Sakshi
Sakshi News home page

భూలోక వైకుంఠమే..

Dec 31 2025 7:26 AM | Updated on Dec 31 2025 7:26 AM

భూలోక వైకుంఠమే..

భూలోక వైకుంఠమే..

స్వామివారికి ప్రత్యేక పూజలు.. మార్మోగిన రామనామం.. వైభవంగా తిరువీధి సేవ

ఆధ్యాత్మికత చాటిన

‘ముక్కోటి’ వేడుకలు

రామయ్య దర్శనంతో పులకించిన భక్తులు

ముక్కోటి ఏకాదశి వేళ భద్రగిరి భూలోక వైకుంఠంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జయ గంటలు మోగుతుండగా మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శన వేడుక ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. రామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమైన ఈ వేడుకలు ఉదయం

ఆరు గంటలకు ముగిశాయి. ఐదు గంటల సమయాన ఉత్తర ద్వారాలు తెరుచుకోగా, ధూపదీపాలు, హారతి వెలుగుల నడుమ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. – భద్రాచలం

ఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారు వెండి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలోకి ప్రవేశించారు. తొలుత దేవస్థాన హరిదాసులు శ్రీరామ కీర్తనలు ఆలపించారు. అనంతరం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామి వారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పారు.

సరిగ్గా తెల్లవారుజామున 5గంటలకు మంగళ వాయిద్య గంట మోగుతుండగా ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. వైకుంఠాన్ని మైమరిపించేలా ప్రత్యేకంగా అలంకరించిన ఈ ద్వారంలో ధూప, దీపాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. గంటపాటు స్వామివారి కి ప్రత్యేక పూజలు చేయగా, ‘శ్రీ రామాయనమః’ అంటూ భక్తుల రామనామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తర్వాత చుతర్వేద పారాయణం చేసి, నివేదన, మంత్రపుష్పం సమర్పించారు. చివరగా 108 వత్తులతో కూడిన హారతి సమర్పించాక శరణాగతి, దండకం అనంతరం ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యాన్ని అర్చకులు వివరించారు.

ఉత్తర ద్వార దర్శనానంతరం శ్రీసీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. గరుడ వాహనంపై స్వామి వారు, గజ వాహనంపై సీతమ్మవారు, హనమత్‌ వాహనంపై లక్ష్మణస్వామిని కొలువుదీర్చి రాజవీధి మీదుగా తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి వెంట నడువగా గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు వెళ్లిన స్వామి వారు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌, పాయం వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌, ఉత్సవాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, భద్రాద్రి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సబ్‌కలెక్టర్‌ మ్రిణాల్‌శ్రేష్ట, ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, ఆలయ ఈఓ దామోదర్‌రావు, భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భద్రగిరిలో నేత్రపర్వంగా ఉత్తర ద్వార దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement