ఖమ్మం వీధుల్లో ‘స్మార్ట్’ వెలుగులు
సీసీఎంఎస్ కంట్రోల్‌తో
వీధిలైట్ల ఆన్, ఆఫ్
ఇప్పటికే 26,842 వీధి దీపాలు
అనుసంధానం
నిర్వహణ కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపకల్పన
కార్యాలయం నుంచే పర్యవేక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతీ పనికి సాంకేతికతను జోడిస్తుండగా, ప్రజాధనాన్ని ఆదా చేసేలా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 26,842 వీధి దీపాలకు సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(సీసీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయగా ఒకే క్లిక్‌తో వీధి దీపాలను ఆన్, ఆఫ్ చేసే అవకాశం లభించింది. అంతేకాక సమస్యలపై ఫిర్యాదులు వస్తే కార్యాలయం నుంచే పరిశీలించే సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది.
సీసీఎంఎస్ ప్రత్యేకత
సాధారణంగా వీధి లైట్లను ఆఫ్ చేయడం, ఆన్ చేయడానికి సిబ్బంది స్విచ్ బోర్డులపై ఆధారపడాల్సిందే. కానీ సీసీఎంఎస్ పరిజ్ఞానంతో అన్ని లైట్లను కార్పొరేషన్ కార్యాలయంలోని కంప్యూటర్ లేదా మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. ఇందులో ఉన్న ఆప్షన్‌తో సూర్యాస్తమయం కాగానే లైట్లు వెలగడం, సూర్యోదయం కాగానే వాటంతట అవే ఆరిపోనుండడంతో వెలుతురు ఉన్నప్పుడు లైట్లు వెలిగి విద్యుత్ వృథా అయ్యే సమస్య తీరనుంది. అలాగే, ఎక్కడైనా లైట్ పాడైతే స్థానికులు ఫిర్యాదు చేసే వరకు ఆగకుండా కంట్రోల్ రూమ్‌కు వచ్చే అలర్ట్ ఆధారంగా సిబ్బంది మరమ్మతు చేసే అవకాశముంది.
విద్యుత్ బిల్లులు ఆదా
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వీధి లైట్ల బిల్లులకు ప్రతీనెల రూ.40 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో పగటి పూట కూడా లైట్లు వెలుగుతూ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు నగరంలోని 26,842 వీధి దీపాలకు గాను ఇప్పటి వరకు 26వేల వరకు దీపాలను సీసీఎంస్‌కు అనుసంధానం చేశారు. తద్వారా బిల్లులు తగ్గడమేకాక రాత్రి వేళ ఎక్కడా చీకటి ఉండకుండా మరమ్మతులు సాధ్యమవుతాయని చెబుతున్నారు.
1,337 సీసీఎంఎస్ పరికరాలు
కార్పొరేషన్ పరిధిలో వీధిలైట్లను మానిటరింగ్ చేయడంతో పాటు వెలిగించడం, ఆపడం కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించారు. 60 డివిజన్లలోని వీధులను విభజించి నిర్వహణ, పర్యవేక్షణ కోసం 1,337 సీసీఎంఎస్ సంబంధిత పరికరాలను అమర్చారు. వీటిలో 1,260 పరికరాలు ప్రస్తుతం యాక్టివ్ అయ్యాయి. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 26 వేల ఎల్‌ఈడీ లైట్లను ఈ సిస్టమ్‌కు అనుసంధానించగా, విద్యుత్ లోడ్ 1348.117 కిలోవాట్స్‌గా రికార్డ్ అయింది.
ప్రతీది గుర్తించేలా..
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఏ ఏరియాలో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఎన్ని ఆఫ్‌లో ఉన్నాయనేది శాతాల వారీగా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడైనా పరికరాలు పనిచేయకపోతే ఆ వివరాలు, ఆ ప్రాంత సిబ్బంది ఫోన్ నంబర్ కూడా డ్యాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. తద్వారా సిబ్బందిని అమ్రత్తం చేసి మరమ్మతు చేయించడం సులభమవుతుంది. నగర మ్యాప్‌లో లైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో పాయింట్ల రూపంలో చూసే అవకాశం వచ్చినందున పర్యవేక్షణ సులువవుతుంది. అంతేకాక ఎక్కడైనా విద్యుత్ సంబంధిత సమస్య ఎదురైతే అది ఏ సమయానికి జరిగింది, మళ్లీ ఎప్పుడు పునరుద్ధరించారనే వివరాలు సెకన్ల వ్యవధిలో అప్‌డేట్ అవుతున్నాయి.
వీధి దీపాల నిర్వహణకు సాంకేతికతను జోడిస్తున్నాం. వీధి లైట్లు వెలగడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండగా, ఇప్పుడు సీసీఎంఎస్ ద్వారా కార్యాలయం నుంచే గుర్తించొచ్చు. తద్వారా ఆన్/ఆఫ్ సులభం కావడంతో పాటు సమస్య ఎదురయ్యే అవకాశమే ఉండదు. ఈ విధానంతో రాష్ట్రంలోనే ఖమ్మం రోల్ మోడల్‌గా నిలవనుంది.
– అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ
ఖమ్మం వీధుల్లో ‘స్మార్ట్’ వెలుగులు
ఖమ్మం వీధుల్లో ‘స్మార్ట్’ వెలుగులు


