రైతులకు న్యాయమైన
● మేలైన, వైవిధ్యమైన పంటలకు ప్రోత్సాహం ● స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సమీక్షలో కలెక్టర్ అనుదీప్
రుణ పరిమితి
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ ఖర్చులు ఏటేటా పెరుగుతున్న క్రమాన రైతుల కోసం వాస్తవికంగా, న్యాయంగా రుణ పరిమితి నిర్ణయించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈక్రమాన అన్నదాతలకు బ్యాంకులు అండగా నిలవాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జ్ హోదాలో ఆయన 2026–27 సంవత్సరానికి సంబంధించి పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయాలపై బ్యాంకులో మంగళవారం జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువులు, విత్తనాల వినియోగం, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దె వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు మేలు చేసేలా రుణపరిమితి ఖరారు చేయాలని తెలిపారు. అవసరమైన చోట సవరణలు చేసి తుది ప్రతిపాదనలు రూపొందించాలని.. మేలైన, వైవిధ్యమైన పంటలు సాగుచేసే రైతులను ప్రోత్సహించేలా ఈ విధానాలు ఉండాలని చెప్పారు. తద్వారా రైతు వ్యవసాయం చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తారని తెలిపారు. అనంతరం బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. తొలుత బ్యాంకు కార్యకలాపాలపై ఆరాతీసిన కలెక్టర్ డీసీసీబీ ఆధ్వర్యాన రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా ఉద్యానవనఅధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
15వ తేదీ నాటికి సర్వే పూర్తి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో భూముల సర్వే జనవరి 15వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన భూసర్వే పనులపై మండలాల వారీగా సమీక్షించి సూచనలు చేశారు. భూసేకరణలో సర్వే శాఖ కీలకపాత్ర పోషించాల్సి ఉన్నా దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈక్రమంలో అత్యధికంగా సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సరైన కారణాలు లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకనుంచి మండలాల వారీగా సర్వేయర్ల పని తీరుపై ఏడీ పర్యవేక్షించాలని సూచించారు. కాగా, భూభారతి ఆధారంగా ప్రభుత్వ భూమి వివరాలు సమర్పించాలని, ప్రతీ మండలంలో ప్రభుత్వ భూమి అధికంగా ఉన్న ఐదు సర్వే నంబర్లను తీసుకొని విస్తీర్ణం, ఆక్రమణల వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు.


