గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి
● సైబర్ క్రైమ్‌పై విచారణ కొనసాగుతోంది.. ● కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్
పెనుబల్లి: కల్లూరు సర్కిల్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పెనుబల్లి మండలం వీఎం.బంజర పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు, కేసుల విచారణపై ఆరా తీశారు. నిందితులు శిక్ష నుంచి తప్పించుకోకుండా విచారణలో సాంకేతికత ఉపయోగించాలని సీఐ ముత్తి లింగం, ఎస్సై కె.వెంకటేష్‌కు సూచించారు. అనంతరం ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ కల్లూరు సబ్ డివిజన్‌ను నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
గంజాయిని కట్టడి చేస్తాం..
పెనుబల్లి తదితర మండలాల్లో గంజాయి వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించామని ఏసీపీ తెలిపారు. గంజాయికి బానిసలవుతున్న యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నందున సరఫరా, వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేలా తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించిన ఆమె, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. అలాగే, మహిళలు, చిన్నపిల్లలపై నేరాలను అరికట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.
ఎవరినీ వదిలేది లేదు..
సైబర్ నేరాల ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టిన కల్లూరు మండలం యర్రబోయినపల్లికి చెందిన ప్రవీణ్ తదితరులపై కేసు నమోదు చేయగా, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని ఏసీపీ వసుంధర తెలిపారు. నిందితులు ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
●కల్లూరు: కల్లూరు పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఏసీపీ వసుంధర యాదవ్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో పరిశీలించాక అధికారులతో సమావేశమైన ఆమె స్టేషన్ నిర్వహణ, కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షించారు. అలాగే, రౌడీ షీటర్లపై నిఘా కొనసాగిస్తూ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


