ఆదర్శంగా ఏదులాపురం మున్సిపాలిటీ
● అన్ని వసతులతో అభివృద్ధి చేస్తాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధి శ్రీరాంనగర్‌లో రూ.20.25లక్షలతో నిర్మించే కల్వర్టు, సాయిగణేష్‌నగర్‌లోని ఎన్‌ఎస్‌పీ కాల్వపై రూ.15.70 లక్షలతో నిర్మించనున్న కల్వర్టుతో పాటు పోలేపల్లిలో డబుల్ బెడ్‌రూం కాలనీలో రూ.25లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశాక మాట్లాడారు. ఏళ్ల తరబడి కల్వర్టుల కోసం నాయకులకు మొరపెట్టుకున్నా పని కాలేదని కాలనీ వాసులు చెప్పారన్నారు. కానీ తన దృష్టికి రాగానే కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీరాంనగర్ కాలనీలో ఒక కల్వర్టు మాత్రమే కాదు ఇంకో రెండు కల్వర్టులు, ప్రతీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడమే కాక ఓవర్‌హెడ్ ట్యాంక్ మంజూరు చేసి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు రేషన్‌కార్డులు, కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాక రైతులకు రుణ మాఫీ చేశామని తెలిపారు. అంతేకాక మొదటి విడతలో 4.50లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పాలేరు నియోజకవర్గంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం పోలేపల్లిలో 56మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, ఏదులాపురం కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ జి.నర్సింహారావు, ప్రత్యేకాధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు తోట చినవెంకటరెడ్డి, వెంపటి రవి తదితరులు పాల్గొన్నారు.


